జాతీయస్ధాయిలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందా ? ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. తాజా డెవలప్మెంట్ ఏమిటంటే ఈనెల 18వ తేదీన ఢిల్లీలోని అశోకా హోటల్లో ఎన్డీయే సమావేశం జరగబోతోంది. నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరగబోతోంది. జరగబోయే సమావేశంలో కీలకమైన పాయింట్ ఏమిటంటే ఎన్డీయేని బలోపేతం చేయటమే. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలని యూపీఏ+ ప్రతిపక్షాలు ఇప్పటికే ఒకసారి సమావేశమయ్యాయి.
రెండో సమావేశం బెంగుళూరులో ఈనెల 11వ తేదీన జరగబోతోంది. అలాగే ఢిల్లీలో ఈనెల 17,18 తేదీల్లో జరగబోతోంది. బీజేపీకి వ్యతిరేకంగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలనే ప్రయత్నం జరుగుతోంది. దీనికి విరుగుడుగా ఎన్డీయే వైపునుండి కూడా ఇదే ప్రయత్నాలు మొదలైనట్లుంది. అందుకనే 18వ తేదీన ఢిల్లీలో ఎన్డీయే మీటింగుకు రావాలని భాగస్వామ్యపక్షాలకు సమాచారం అందింది.
భాగస్వామ్యపక్షాలకు మాత్రమే ఆహ్వానం అందితే అందులో వితేముంది. అందుకనే పాతమిత్రులను మళ్ళీ కలుపుకునే ఆలోచన మోడీకి వచ్చినట్లుంది. ఇందులో భాగంగానే టీడీపీ, అకాలీదళ్, లోక్ జనశక్తి పార్టీల అధినేతలకు కూడా ఆహ్వానం అందినట్లు ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎన్డీయే కానీ బీజేపీ తరపున కానీ ఎవరు ప్రకటించలేదు. ఎన్డీయే మీటింగుకు పై మూడుపార్టీలకు హాజరుకావాలని సమాచారం అందినట్లు ప్రచారమైతే బాగా జరుగుతోంది. అయితే దీన్ని టీడీపీ ఖండించింది. తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పింది.
జరుగుతున్న ప్రచారం నిజమైతే రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిపోటీ చేయటం ఖాయమనే అనుకుంటున్నారు. ఇప్పటికైతే పై మూడుపార్టీలు కలిసి పోటీచేయటంపై ఎలాంటి క్లారిటిలేదు. ఆమధ్య కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో చంద్రబాబు భేటీ అయ్యారు కానీ దానికి సంబంధించిన విషయాలేవీ బయటకు రాలేదు. అటు బీజేపీ కానీ ఇటు టీడీపీ కానీ వివరాలను ఎవరూ బయటకు చెప్పలేదు. ఇంతలోనే ఎన్డీయే సమావేశానికి హాజరవ్వాలని టీడీపీకి ఆహ్వానం అందిందని ప్రచారం మొదలవ్వటంతో అప్పుడే పొత్తుల గురించి కూడా ప్రచారం మొదలైపోయింది. అసలు విషయం తెలియాలంటే 18వ తేదీ మీటింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే.