ఇటీవల కాలంలో విపక్ష పార్టీ నాయకులు.. కొందరు పారిశ్రామిక వేత్తలపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల దాడులు పెరిగిపోయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో దేశంలోని విపక్ష పార్టీలు.. కేంద్రంపై పోరుకు సైతం సిద్ధమయ్యాయి. అదేవిధంగా.. సీబీఐ కూడా. ఈ రెండు సంస్థల దాడులు.. నమోదు చేస్తున్న కేసులతో కీలక నాయకులు కూడా ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. ఇక, తాజాగా ఈడీకి సంబందించి.. సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే.. సంచలన ఆరోపణలు చేశారు.
“మనీలాండరింగ్ కేసుల్లో దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అసాధారణ అధికారాలు కట్టబెట్టారు. ఆ అధికారాలను వెనక్కి తీసుకోకపోయినా.. అధికారుల దూకుడు అదుపుచేయ కపోయినా.. దేశంలో ఎవరికీ భద్రత ఉండదు. అంతేకాదు.. దేశం కూడా నాశనం అయిపోతుంది“ అని సంచలన వ్యాఖ్యాలు చేశారు. సాల్వే ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో సుప్రీం కోర్టులో నిశ్శబ్దం ఆవరించడం.. అందరూ విస్మయంగా చూడడం కనిపించింది.
ఏం జరిగింది?
యూపీ శివారులోని గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన ఎం3ఎం కంపెనీపై ఈడీ అధికారులు మనీలాండరిం గ్ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కంపెనీ తరఫున సాల్వే వాదనలు వినిపించారు. అయితే.. ఆయన ఈడీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరగడం గమనార్హం.
‘‘ఎం3ఎం కేసులో ఎలా అరెస్టు చేశారో చూడండి. విచారణకు సహకరించినా.. అధికారులు కంపెనీ వారిని అరెస్టు చేశారు. ఇది పూర్తిగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ముందస్తు బెయిల్ షరతుల ను ఉల్లంఘించినట్లు నిందితులపై ఎక్కడా ఆధారాల్లేవ్. అయినా, ఈడీ ఇలా దారుణంగా వ్యవహరించి అరెస్టుకు పాల్పడింది’’ అని సాల్వే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన ఈడీని కోర్టు అదుపు చేయాలని కోరారు. అలా చేయకుండా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తే.. దేశంలో ప్రజలు బతకలేరన్నారు. అంతేకాదు.. దేశం కూడా నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు,