విన్నంతనే నోరెళ్లబెట్టే వైనంగా దీన్ని చెప్పాలి. ఒక ఎకరా పంటకు నష్టపరిహారంగా ప్రభుత్వం ఇస్తున్న ధర లెక్క ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. ప్రభుత్వం నుంచి అందుతున్న పరిహారం.. ఇప్పుడు కిలో టమాటా ధర కంటే తక్కువగా ఉండటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయితే.. అతి తక్కువ పరిహారాన్ని అందిస్తూ.. చేతులు దులుపుకునే తీరు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. తాజాగా పెరిగిన ధరల నేపథ్యంలో ఈ అంశం తెర మీదకు వచ్చింది.
వర్షాల కారణంగా తరచూ దెబ్బ తినే టమాటా పంటకు ఇచ్చే పరిహారాన్ని ప్రశ్నిస్తున్నారు. కారణం.. ఒక ఎకరా టమాటా పంట ఏదైనా కారణాల వల్ల దెబ్బ తింటే.. వాటి రైతులకు అందుతున్న నష్ట పరిహారం ఎంతో తెలుసా? అక్షరాల రూ.109 మాత్రమే ఒక ఎకరా టమాటా పంటను సాగు చేయాలంటే అయ్యే ఖర్చు తక్కువలో తక్కువ రూ.30వేలు. కానీ.. అదే పంట దెబ్బ తిన్నప్పుడు మాత్రం చేతికి అందే సాయం మాత్రం రూ.109 మాత్రమే.
గడిచిన కొద్ది రోజులుగా టమాటా ధరలు భారీగా పెరిగిపోవటం.. వారంలో ధరలు అదుపులోకి వస్తాయని చెప్పినప్పటికీ ఆ జాడ లేకపోవటం తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్ లో కేజీ టమాటా ధర రూ.140 వరకు నడుస్తోంది. ఈ లెక్కన చూస్తే.. ఎకరా టమాటా పంటకు ప్రభుత్వం నుంచి అందే నష్టపరిహారంతో పోలిస్తే.. కేజీ టామాటా ధరే ఎక్కువగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఒక లెక్కను కూడా చూపిస్తున్నారు.
గత ఏడాది ఏపీలోని సత్యసాయి జిల్లాలో 1702 ఎకరాల్లో టమాటా పంట దెబ్బ తింది. దీంతో.. పరిహారం కోసం ప్రతిపాదనలు పంపగా.. అధికారులు రూ.1,88,600 మొత్తాన్నిపరిహారం కింద రైతులకు అందించారు. అంటే.. ఈ మొత్తాన్ని 1702 ఎకరాలకు లెక్కిస్తే.. ఎకరాకు వచ్చే నష్టపరిహారం రూ.109 మాత్రమే. పరిహారం పేరుతో రైతుల్ని ఆదుకుంటున్నట్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవానికి వారి చేతికి అందే పరిహారం మొత్తం మరీ ఇంత తక్కువా? అని నోరెళ్లబెడుతున్నారు.