బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి తనకు దక్కలేదన్న అక్కసుతో బీజేపీ పెద్దలపై దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, అసెంబ్లీలో బిజెపి ఫ్లోర్ లీడర్ లేదంటే బిజెపి తెలంగాణ అధ్యక్షుడు…0ఈ మూడు పదవుల్లో ఏదో ఒకటి తనకు ఇవ్వకపోతే జేపీ నడ్డా పై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని రఘునందన్ అన్నట్టుగా కొన్ని వార్తలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై రఘునందన్ రావు స్పందించారు. బిజెపి హై కమాండ్ కు అల్టిమేటమ్ ఇచ్చినట్టుగా వస్తున్న వార్తలను రఘునందన్ రావు ఖండించారు. అంతటి తీవ్ర వ్యాఖ్యలు తాను చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా తాను ఎక్కడా మాట జారలేదని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న వారిలో తాను కూడా ఒకడినని చెప్పారు. దుబ్బాక అభివృద్ధి పనుల కోసమే కిషన్ రెడ్డిని కలిశానని వెల్లడించారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు ఆ వార్తలను ఉపసంహరించుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు
తాను క్రమశిక్షణ గల బీజేపీ కార్యకర్తనని, కమలం-రఘునందన్ రావు ఒకటేనని అన్నారు. నిన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ఢిల్లీ వెళ్ళిన రఘునందన్ రావు బీజేపీ అధిష్టానంపై అలకబూనారని ప్రచారం జరిగింది. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్నా…సరైన పదవి దక్కలేదని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లుగా ప్రచారం జరిగింది. బండి సంజయ్ ది స్వయం కృతాపరాధమని, ఆయన చేసిన పనుల వల్లే ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి పోయిందని రఘునందన్ అన్నట్లు ప్రచారం జరిగింది.