రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా చూసిన భీమవరం సభ పూర్తైంది. దాదాపు 65 నిమిషాలకు పైనే మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన ప్రసంగంలో ఎక్కువ భాగం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకే కేటాయించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి నోటి నుంచి ఇటీవల తన గురించి చేసిన వ్యాఖ్యలను నిజమేనని అంగీకరించటం ఆసక్తికరంగా మారింది.
ఇటీవల జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. బహిరంగ సభల్లో మాట్లాడేటప్పుడు మనిషి ఊగిపోతారని.. ఆవేశపడిపోతారని.. తొడలు కొడతారన్న సీఎం జగన్.. బట్టలూడదీసి కొడతానంటూ దారుణ రీతిలో వ్యాఖ్యలు చేస్తారన్నారు. సీఎం నోటి నుంచి వచ్చిన ఊగిపోతాను.. ఆవేశపడతానన్న మాటలను ప్రస్తావించిన పవన్.. ముఖ్యమంత్రి చెప్పినట్లే చేస్తానని పేర్కొన్నారు.
తన ఆవేశాన్ని.. ఊగిపోవటాన్ని జస్టిఫికేషన్ ఇచ్చే క్రమంలో ఆయన చేసిన వాదనను చూస్తే.. ‘‘నిజంగానే నేను ప్రసంగం చేసేటప్పుడు ఊగిపోతాను. ఆవేశ పడతాను. ఎందుకంటే పేదోడి కష్టం నా కష్టం అనుకుంటాను. నిత్యం వేలాది మంది చెప్పే బతుకు కథలు నన్ను దహించి వేస్తాయి. పాలకుల దాష్టీకాలు.. వారు చేస్తున్న వికృత చేష్టలు నన్నుకుదురుగా ఉంచవు. ప్రజల కన్నీళ్లునా కుటుంబం పెట్టే కన్నీళ్లుగా భావిస్తా.
అందుకే అన్యాయం జరిగిన వేదిన నుంచి నా ఆవేశం వస్తుంది. ఈ వ్యవస్థలు పేదలను.. బాధితులను ఎందుకు పట్టించుకోవటం లేదన్న ఆలోచన నుంచి నా మాటలు వస్తాయి’’ అంటూ సుదీర్ఘంగా వివరించారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని అంగీకరిస్తూ.. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.