ఒక కుక్క కనిపించకుండా పోయింది. మామూలుగా అయితే.. ఇదేమీ పెద్ద వార్త కాదు. కానీ.. సదరు కుక్క అలాంటి ఇలాంటి వారికి చెందినది కాదు. మేరఠ్ పోలీసు కమిషనర్ సెల్వ కుమారి అపురూపంగా పెంచుకునే కుక్క మిస్ కావటంతో పోలీసు యంత్రాంగం మొత్తం రోడ్ల మీదకు వచ్చింది. బాస్ కుక్క మిస్ కావటానికి మించిన పెద్ద క్రైం ఇంకేం ఉంటుందని అనుకున్నారో ఏమో కానీ.. మేరఠ్ పోలీసులు చేసిన హడావుడికి ఇదో జాతీయ వార్తగా మారింది.
సదరు పోలీసు కమిషనర్ కు చెందిన కుక్కు జర్మన్ షెపర్డ్ జాతికి చెందింది. దాని పేరు ఎకో. ఆ జాతి కుక్కులు మేరఠ్ లో 19 మాత్రమే ఉన్నాయి. ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఈ కుక్క కనిపించకుండా పోతే.. పోలీసు సిబ్బంది కమిషనర్ గారి ఇంటికి వెళ్లి.. మిస్ అయిన కుక్క వివరాలు.. దాని ఫోటో తీసుకొని గాలింపు మొదలు పెట్టారు. కుక్క ఆచూకీ కోసం ఏకంగా 500 ఇళ్లను తనిఖీ చేయటం సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో జిల్లా జంతువుల సంరక్షణాధికారి హర్పల్ సింగ్ సైతంపోలీసు కమిషన్ ఇంటికి చేరుకొని.. మిస్ అయిన కుక్క ఫోటోను తీసుకొని మరీ వెతికిన వైనం అధికారిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. తనపైనా.. తప్పిపోయిన తన కుక్క మీద వస్తున్న కథనాలపై సెల్వకుమారి సీరియస్ అయ్యారు. తమ ఇంటి గేటు తీసి ఉండటంతో కుక్క బయటకు వెళ్లిందని.. తమ ఇంటికి సమీపంలోనే అది తిరుగుతున్న విషయాన్ని గుర్తించిన కొందరు దాన్ని తిరిగి తమ ఇంటికి తీసుకొచ్చినట్లుగా పేర్కొన్నారు. కుక్క చోరీకి గురి కాలేదని.. దాని కోసం పోలీసులు వెతకలేదన్న ఆమె మాటల కంటే కూడా.. 36 గంటల పాటు పెద్ద ఎత్తున పోలీసులు గాలింపు జరిపిన అంశమే వార్తాంశంగా మారటం గమనార్హం.