రాజకీయ ప్రత్యర్థుల్ని తన నోటి మాటతో ఉతికి ఆరేసే ఏపీ మంత్రిగా అంబటి రాంబాబు సుపరిచితుడు. నువ్వు ఒకటి అంటే నేను పది అంటానన్నట్లుగా వ్యవహరించే ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్య సంచలనంగా మారింది. రాజకీయ వర్గాల్లోనూ అంబటి మాటను ప్రస్తావించటం విశేషం. రాష్ట్ర జలవనరుల మంత్రిగా వ్యవహరిస్తున్న అంబి తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రాతినిధ్యం వహించే సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడిన అంబటి.. తాను పుట్టింది రేపల్లెలో అయినా చచ్చేది మాత్రం సత్తెనపల్లిలో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ గురించి ఆయన ఇప్పటివరకు ఎవరూ చేయని వ్యాఖ్య చేయటం గమనార్హం. ‘ఎస్.. వందమంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్మోహన్ రెడ్డే అవుతారు. రాజారెడ్డి ఏమైనా విలనా? ఆయన రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డిని అందించారు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
ఈ మధ్యన టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ మీద ఆయన విమర్శలు సంధించారు. ఇటీవల సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జిగా ఆయన్ను ఎంపిక చేసిన నేపథ్యంలోకన్నా ప్రస్తావన తెచ్చిన అంబటి.. ‘జగన్ గురించి ముందే తెలిసిన కన్నా.. గతంలో ఆయన ప్రాపకం కోసం 500 కార్లతో ర్యాలీగా బయలుదేరి.. మధ్యలో గుండెనొప్పి అంటూ నాటకాలు ఆడారు. అలా చెందుకు చేశారో చెప్పాలి’ అని ప్రశ్నించారు.
బీజేపీ ఎన్నికల డబ్బులు మింగేసిన కన్నాకు.. తనను.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. సత్తెనపల్లో నుంచి కన్నా పోటీ చేస్తారో.. చివరకు పారిపోతారో తెలీదన్న ఆయన.. విపక్ష నేత చంద్రబాబు మీద ఒక ఆసక్తికరవ్యాఖ్య చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా ఊరుకోవటానికి తానేమీ చంద్రబాబును కాదని.. రాజశేఖరెడ్డి శిష్యూడ్ని అంటూ అంబటి వ్యాఖ్యానించారు. బాబుకు ఫేవర్ గా మారే ఈ మాట అంబటి నోటి నుంచి రావటాన్ని పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.