మాటలతో మంటల పుట్టించే జనసేనాని పవన్ కల్యాణ్.. వైరుధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఓవైపు తాను ఆచితూచి మాట్లాడతానని.. నోటి నుంచి మాట రావటానికి ముందు ఎంతో సంఘర్షణ ఉంటుందని.. అంత తొందరపడి మాట అనే వ్యక్తిని కాదని చెబుతారు. మరోవైపు ఆయన ప్రసంగాల్ని చూస్తే.. తాను టార్గెట్ చేసే వారి విషయంలో ఆయన ఎంత దురుసుగా.. దూకుడుగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారాహి విజయయాత్ర సందర్భంగా తాను లక్ష్యంగా చేసుకున్న వారి పేర్లను అదే పనిగా ప్రస్తావిస్తూ.. ఓపెన్ సవాళ్లు విసిరారు.
ఈ సందర్భంగా ఆయన మాటల్లోని ఆగ్రహం కొన్నిసార్లు మోతాదు మించినట్లుగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందరిని ఒకేలా టార్గెట్ చేయకుండా.. తనను విమర్శించే వారి విషయంలో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. వైసీపీకి చెందిన కొందరు కాపు నేతల్ని పేరు పెట్టి మరీ విమర్శలు చేసే పవన్.. కాపు ఉద్యమ నేత ముద్రగడ విషయంలో మాత్రం ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం.
కాపు ఉద్యమనేత అన్నంతనే తెలుగుప్రజలకు గుర్తుకు వచ్చేది ముద్రగడ పద్మనాభమే. కాపుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతారన్న పేరున్న ఆయన.. పదవులు తీసుకోవటానికి మాత్రం ముందుకు రాకపోవటం తెలిసిందే. సాధారణంగా రాజకీయాల్లో ఉన్నంతనే పదవుల్ని తీసుకునేందుకు నేతలు ఆసక్తి ప్రదర్శిస్తారు. కానీ.. ముద్రగడ స్కూల్ అందుకు భిన్నం. ఆయన పదవులకు దూరంగా ఉంటారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలపైనా..ఆయన తీరుపైనా నిప్పులు చెరిగే ముద్రగడ.. ఇటీవల రెండు లేఖలు రాయటం తెలిసిందే. ఈ లేఖల ద్వారా పవన్ కు కొన్ని ప్రశ్నల్ని సంధించారు పవన్ కల్యాణ్.
ఆ ప్రశ్నలపై ఇప్పటివరకు స్పందించింది లేదు. తాజాగా వారాహి విజయయాత్రలో భాగంగా ఆయన అమలాపురం జిల్లాలోని మలికిపురంలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. నిప్పులు చెరిగారు. ఈ సభలో పలువురు ముద్రగడ పద్మనాభానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ముద్రగడను కులద్రోహిగా అభివర్ణించారు. అయితే.. పవన్ కల్యాణ్.. ముద్రగడను కించపరిచేలా ఉన్న ప్లకార్డులపై అభ్యంతరాలు వ్యక్తం చేయటం గమనార్హం.
ముద్రగడను తిట్టిపోసే ప్లకార్డుల్ని తీసేయాలని కోరిన జనసేనాని.. ‘‘పెద్దలు ఏవో కొన్ని మాటలు అంటారు. వాటిని తీసుకోవాలే తప్ప విమర్శించకూడదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. పవన్ తాజా చర్య వ్యూహత్మకంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తనను తిట్టిపోస్తూ.. విమర్శలతో విరుచుకుపడే ముద్రగడ మీద పవన్ గౌరవ మర్యాదల్ని ప్రదర్శించిన తీరు చూస్తే.. అదంతా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవులకు దూరంగా ఉండే ముద్రగడను మాట అంటే.. తనకే నష్టమన్న విషయాన్ని పవన్ గుర్తించారని అంటున్నారు.
ముద్రగడను మాట అనే విషయంలో పవన్ ఒక అభిప్రాయానికి వచ్చి ఉన్నప్పుడు.. తాను పాల్గొనే సభలో ముద్రగడకు వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు. . ప్లకార్డులు ప్రదర్శించకూడదన్న మాట ముందే బలంగా సందేశాన్ని పంపించి ఉంటే.. ఆదివారం రాత్రి నిర్వహించిన సభలో అలా జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు జనసేనాని స్కూల్ కు.. జనసైనికులకు మధ్య అంతరం ఉందన్న విషయం అర్థమవుతోంది. తనను వేలెత్తి చూపించే ముద్రగడ విషయంలో సైలెంట్ గా ఉండటం ద్వారా పలువురి మనసుల్ని దోచుకునే వ్యూహాన్ని తెలివిగా ప్రదర్శించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముద్రగడను విమర్శిస్తే.. ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కష్టాన్ని స్కిప్ చేయటం కోసమే.. మంచి మాటలు మాట్లాడారన్న మాట వినిపిస్తోంది. తనపై పవన్ వ్యవహరించిన తీరుకు ముద్రగడ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.