రష్యాలో ఎవరు ఊహించని విధంగా అంతర్యుద్ధం మొదలైపోయింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు లేచింది. ఒకవైపు ఉక్రెయిన్ తో యుద్ధంతో ఇబ్బందులు పడుతున్న పుతిన్ సడెన్ గా మొదలైన తిరుగుబాటుతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే పుతిన్ కు ఊరట ఏమిటంటే తిరుగుబాటు మొదలైంది జనాల్లో కాదు ఒక కిరాయి సైన్యంతోనే. పుతిన్ పై వాగ్నర్ గ్రూపు సడెన్ గా తిరుగుబాటు లేవదీసింది. రోస్తోవ్ నగరంలోని మిలిటరీ బేసులు, ప్రభుత్వ కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నది.
రోస్తోవ్ లోని కీలకమైన మిలిటరీ బేసులను ఆధీనంలోకి తీసుకున్న వాగ్నార్ గ్రూపు సైన్యం రాజధాని మాస్కోవైపు దూసుకువస్తోంది. ఇక్కడ విషయం ఏమిటంటే వాగ్నర్ గ్రూపు అన్నది ఒక కిరాయి హంతక సైన్యం. దీని హెడ్ ప్రిగోజిన్. ఈయన గతంలో రష్యా మిలిటరీలో ఉన్నతస్ధాయి అధికారిగా పనిచేసి రిటైరయ్యారు. ఈయనే వాగ్నర్ గ్రూపును ఏర్పాటుచేశారు. ఈ గ్రూపు రష్యా మిలిటరీకి కూడా గతంలో సాయంచేసింది. అధికారికంగా రష్యా ప్రభుత్వం చేయలేని పనులను వాగ్నర్ గ్రూపు ద్వారా చేయిస్తుంటుంది.
ఈ గ్రూపులో వేలాదిమంది కిరాయి మనుషులున్నారు. వీళ్ళ దగ్గర రష్యా మిలిటరీ దగ్గర ఉన్నట్లే అత్యాధునిక ఆయుధాలున్నాయి. ముఠాలోని వేలాది మంది సైన్యంలో అత్యధికులకు నేరచరిత్ర ఉన్నది. వివిధ నేరాలపై వివిధ జైళ్ళల్లో శిక్షలు అనుభవించిన వాళ్ళు, బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళనే సభ్యులుగా ప్రిగోజిన్ తన వాగ్నర్ గ్రూపులో చేర్పించుకున్నాడు. ఇలాంటి వాళ్ళందరికీ పెద్దఎత్తున శిక్షణిచ్చి నెలవారీ పెద్దమొత్తంలో జీతాలు ముట్టచెబుతున్నాడు.
ఈ గ్రూపుకు ప్రభుత్వ సహకారం కూడా పరోక్షంగా ఉందనే ప్రచారం జరుగుతోంది కాబట్టి ఈ గ్రూపుజోలికి పోలీసులు కూడా వెళ్ళరు. దాంతో గ్రూపు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది. ఈ విధంగా వేలాదిమంది ప్రైవేటుసైన్యాన్ని పెట్టుకున్న ప్రిగోజిన్ అత్యంత బలవంతుడిగా తయారయ్యాడు. ఇపుడా ప్రిగోజినే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశాడు. ప్రిగోజిన్ దేశద్రోహానికి పాల్పడినట్లు పుతిన్ ప్రకటించాడు. మరి ఈ తిరుగుబాటును పుతిన్ ఏ విధంగా అణిచివేస్తారో చూడాల్సిందే.