తెలుగు ప్రజలకు మరో కొత్త పదం పరిచయం కానుంది. సామాన్యులకు ఇప్పటివరకు పట్టని.. తెలియని ‘టైమ్ ఆఫ్ డే’ అన్న పదం రానున్న రోజుల్లో రోజువారీ పదంగా మారనుంది. ఎందుకంటే.. ఈ పదంతో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ టారిఫ్ విధానమే దీనికి కారణం. కేంద్రంలోని మోడీ సర్కారు కొత్తగా తీసుకొస్తున్న విద్యుత్ ఛార్జీల టారిఫ్ పథకాన్ని సింఫుల్ గా చెప్పేస్తే.. టైమ్ ఆఫ్ డేగా చెప్పాలి. ఇప్పటివరకు రోజు మొత్తంలో కరెంటును వాడితే బిల్లు ఒకేలా ఉంటుంది. కానీ.. కొత్త విధానం అందుకు భిన్నంగా.. ఉదయం వేళలో విద్యుత్ వాడితే తమ బిల్లులో 20 శాతం తగ్గింపు ఉంటుంది.
అదే సమయంలో రాత్రి వేళల్లో కరెంటు వాడితే 10-20 శాతం అదనంగా వేస్తారు. అయితే.. ఉదయం వేళలోనూ వేర్వేరు సమయాల్లో వేర్వేరు టారిఫ్ లు ఉంటాయని చెబుతున్నారు. ధరలు తక్కువగా ఉన్నప్పుడు విద్యుత్ వాడకం ఎక్కువగా చేసుకోవటం.. ఎక్కువ టారిఫ్ లు ఉన్నప్పుడు పొదుపుగా వాడుకోవటం ఒక పనిగా మారనుంది.
ఈ కొత్త తలనొప్పి ఎప్పటి నుంచి అంటే దానికి మరో ఏడాదిన్నర సమయం ఉంది. 2025 ఏప్రిల్ 1 నుంచి అన్ని విభాగాల వినియోగదారులకు అమల్లోకి తీసుకొస్తున్నారు. ఊరట కలిగించే విషయం ఏమంటే.. వ్యవసాయ వినియోగదారులకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజాగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం చూస్తే. పగటి వేళలో.. (దాదాపు 8 గంటలు) టారిఫ్ లు సాధారణం కంటే 10-20శాతం తక్కువగా ఉంటాయి. వినియోగం ఎక్కువగా ఉండే వేళలో సాధారణ ధరలతో పోలిస్తే 10-20 శాతం ఎక్కువగా ఉంటాయి.
ఈ పీక్స్ అవర్స్ ఎక్కువగా రాత్రి వేళలోనే ఉంటాయి. నిజానికి.. మన రోజువారీ వాడకం చూస్తే.. ఉదయంవేళలో ఎవరికి వారు పనుల మీద బయటకు వెళ్లిపోతాం. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వస్తాం. రాత్రికి అందరం ఇంటికి చేరుకుంటాం. అంటే.. ఉదయంతో పోలిస్తే రాత్రి వేళలో వినియోగం రెట్టింపు ఉంటుంది. కొత్త విధానం ప్రకారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు తక్కువ టారిఫ్ తో ఉండి.. ఇంటికి అందరూ వచ్చేసి విద్యుత్ వాడకం ఎక్కువగా ఉండే వేళలో.. 10-20 శాతం అదనపు టారిఫ్ ఉంటుంది. దీంతో.. ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లు పెరగటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.