జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న ప్రతి బహిరంగ సభకు వేలాదిమంది జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు వర్సెస్ జనసేన నేతలు అన్న రీతిలో మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు, పవన్ కళ్యాణ్ భాష పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ పెను దుమారం రేపుతోంది.
దీంతో, ముద్రగడ పద్మనాభాన్ని తప్పుబడుతూ కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్యతో పాటుగా కాపు యువసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ కాపు నేతల విమర్శలను రఘురామ తప్పు పట్టారు. పవన్ పై కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు మాటల దాడి చేయడం సరికాదని రఘురామ అభిప్రాయపడ్డారు. ఓ రకంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు పవన్ కి మేలు చేస్తాయని రఘురామ అన్నారు. ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకే చంద్రబాబు, లోకేష్, పవన్ యాత్రలు చేపడుతున్నారని చెప్పారు.
అయితే, ప్రజల్లో తిరగాల్సిన ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా పరదాల మాటున దాక్కుంటున్నారని, ఆ రకంగా ప్రజలకు దూరం అవుతున్నారని అన్నారు వైసిపి పరిస్థితి నానాటికి దిగజారి పోతుందని రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పుకు తమ పార్టీ నేతలు శిరసా వహించక తప్పదని అన్నారు ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పవన్ చేసిన వ్యాఖ్యలలో తప్పేముందని రఘురామ ప్రశ్నించారు. 175కు 175 సీట్లు గెలవాలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిందేమీ లేదని చెప్పారు. పవన్ ను కాపు నేతలతో జగన్ తిట్టించారని, ఆనాడు లేఖ రాయని ముద్రగడ ఈరోజు వైసీపీ నేతలపై పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టడం సమంజసమేనా అని నిలదీశారు.