జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాకినాడలో పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాకినాడలో మత్స్యకారులతో పవన్ సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులను ప్రోత్సహిస్తే స్విమ్మింగ్ లో రాణిస్తారని పవన్ అభిప్రాయపడ్డారు. మత్స్యకారుల జీవన శైలికి ఆక్వా స్పోర్ట్స్ దగ్గరగా ఉంటాయని పవన్ అన్నారు. వ్యవసాయంతో సమానంగా మత్స్యకార వృత్తిని చూడాలని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే, తాను జగన్ లాగా అద్భుతాలు చేస్తానని చెప్పనని, కానీ, మత్స్యకారుల అభివృద్ధి కోసం పని చేస్తానని మాత్రం చెప్పగలనని పవన్ అన్నారు.
మత్స్యకారులకు ఇసుక వంటి సహజ ఖనిజాల కాంట్రాక్టులు ఇస్తే ఆర్థిక అసమానతలు తొలగుతాయని వ్యాఖ్యానించారు. సరైన నాయకులను మత్స్యకారులు ఎన్నుకోవాలని, వారికి ఎప్పుడూ జనసేన అండగా ఉంటుందని పవన్ చెప్పారు. రాబోయే ఎన్నికలలో జనసేనకు మద్దతునివ్వాలని, జనసేన ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. జనసేన ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మత్స్యకారులు సహకరించాలని, మత్స్యకారుల కోసం తాను పనిచేస్తానని పవన్ హామీ ఇచ్చారు. తనకు ఏ పదవి లేకున్నా సరే ప్రధాని నరేంద్ర మోడీ గౌరవం ఇస్తున్నారని అన్నారు.
మత్స్యకారులు జనసేన అభ్యర్థులను గెలిపిస్తే కేంద్ర మంత్రులతో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ అన్నారు. దివిస్ వంటి కెమికల్ ఫ్యాక్టరీలు సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా వ్యర్ధాలను విసర్జిస్తున్నాయని, జనసేన అధికారంలోకి వస్తే పర్యావరణానికి విఘాతం కలగకుండా పరిరక్షిస్తానని పవన్ హామీ ఇచ్చారు. అయితే, తాను పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, అదే సమయంలో మత్స్యకారుల జీవితాలను, ఉపాధిని దెబ్బతీసేలా పరిశ్రమలు ఉంటే చూస్తూ ఊరుకోబోనని అన్నారు. మత్స్యకారులకు సొంత పడవలు ఉండేలా సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఏదేమైనా కాకినాడలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.