మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఉపాసన, రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. దీంతో.. మెగా కుటుంబంలో మరో తరంలోకి అడుగు పెట్టినట్లైంది. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వటం.. అందుకు తగ్గట్లే తన ఖాతాలో బోలెడన్ని విజయవంతమైన సినిమాల్ని వేసుకోవటం తెలిసిందే. 2012లో పెళ్లైనా ఇంతవరకు పిల్లలు లేరన్న లోటును తీరుస్తూ.. గత ఏడాది డిసెంబరు 12న తాము తల్లిదండ్రులం కానున్నట్లుగా ప్రకటన చేశారు.
సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి మోగా ఫ్యామిలీ చేరుకోవటం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లుగా ప్రకటించారు. దీంతో.. మెగా ఇంట సంబరాలు మిన్నంటాయి. కొద్ది రోజుల క్రితం ఉపాసన సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించటం తెలిసిందే. మెగా ఫ్యామిలీలో మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సాధారణంగా భార్యభర్తలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ఇంట్లో ఉండి.. పిల్లలు పుట్టిన తర్వాత వేరు కాపురం పెట్టే రోటీన్ కు భిన్నంగా.. ఇన్నాళ్లు తాము విడిగా ఉన్న విషయాన్ని ఉపాసన తెలియజేయటం తెలిసిందే.
తాము తల్లిదండ్రులు అయ్యాక అత్తమామలతో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ఉపాసన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పటం ఆసక్తికరంగా మారింది. తమ పిల్లల ఎదుగుదలలో నానమ్మ తాతయ్యలు కీలక పాత్ర పోషించాలని.. వారితో ఉండే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలని తాను అనుకోవటం లేదని ఆమె చెప్పటం తెలిసిందే. మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తీపికబురు వచ్చేసిన వేళ.. అంతా సంబరాల మూడ్ లో ఉన్నట్లు చెబుతున్నారు.