యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అందరినీ ముంచేశాడని నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదని మండిపడ్డారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా కుల్లూరు క్యాంప్ సైట్ వద్దకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో సమావేశమైన లోకేష్ వారి సమస్యలు తెలుసుకున్నారు.
45 ఏళ్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తానని జగన్ మోసం చేశాడని గ్రామాల ప్రజలు చెప్పారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. మహిళల్ని ఆదుకోవడం కోసం మహాశక్తి పథకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో 90 వేలు. ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆర్టీసి బస్సు ప్రయాణం ఉచితం, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తామని లోకేష్ పేర్కొన్నారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములు డినోటిఫై చేసి యానాదులకు కేటాయిస్తామని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ వర్గాల మాదిరిగా… యానాదులు సైతం జగన్ బాధితులే అని నారా లోకేష్ వెల్లడించారు. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ అందరినీ ముంచేశాడని పేర్కొన్నారు . యానాదులు కష్ట జీవులు. కష్టాన్ని నమ్ముకున్నారన్న ఆయన… తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తండాలను అభివృద్ది చేసినట్లు వెల్లడించారు. తండాల్లో మౌలిక వసతులు, రోడ్లు, త్రాగునీరు సౌకర్యం కల్పించానన్నారు. ఐటీడీఏ లు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదే అని పేర్కొన్నారు.
టీడీపీ ప్రభుత్వంలోనే 500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా గుర్తించిందని లోకేష్ వెల్లడించారు. ఎస్టీలకు వ్యవసాయ భూములు కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామన్న లోకేష్… ఈ సారి సైతం అధికారంలోకి వచ్చిన వెంటనే యానాదులకు పక్కా ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. ఆయా వర్గాల దామాషా ప్రకారం కమ్యూనిటీ భవనాలు, స్మశానాలు ఏర్పాటు చేస్తామని లోకేష్ వెల్లడించారు. సీసీ రోడ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు
“యానాది యువతకి ఉద్యోగాలు రావడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను స్వాధీనం చేసుకున్నారు. అధికారంలోకి వస్తే బోర్లు వేసి సాగుకి నీరు అందిస్తాం అని జగన్ మోసం చేశాడు.“ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.