వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి రెండు రోజులపాటు కిడ్నాపర్లు అదుపులో ఉంచుకోవడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్పందించారు.
కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియా ముందు ఆ అంశంపై స్పందించారు. వైజాగ్ లో నేటి పరిస్థితులకు ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారం ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. భీకర తుఫాను హుద్ హుద్ ను తట్టుకున్న విశాఖ…ఈ రోజు వైసీపీ అక్రమార్కుల దెబ్బకు విలవిల లాడుతోందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తులను, ప్రజలను భయపెట్టి ఎంత కాలం జగన్ పరిపాలన చేస్తాడని ఆయన ప్రశ్నించారు. ఇప్పటిదాకా భరించిన జనం ఎదురు తిరుగుతున్నారని, రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని స్పష్టం చేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జాంగ్ సోదరుడిలా జగన్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. పులివెందులలో ప్రజలను భయపెట్టి జగన్ గెలుస్తున్నాడని ,ప్రజాభిమానంతో తాను కుప్పంలో గెలుస్తున్నానని గర్వంగా అన్నారు.
దెబ్బతిన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత సీనియర్ నేత అయిన తనపై ఉందని అన్నారు. రాష్ట్రంలోని స్థితిగతులు చూసి మినీ మేనిఫెస్టో విడుదల చేశామని, పేదలను ధనికులను చేయడమే తన సంకల్పం అని అన్నారు. హైదరాబాద్ మాదిరిగా అమరావతిని కూడా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఏపీలో ప్రభుత్వ ఆదాయం ఎందుకు పడిపోయిందో చెప్పాలని జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.
తెలంగాణ, ఏపీల మధ్య ఆదాయాల్లో వ్యత్యాసం 40 వేల కోట్ల రూపాయలు ఉందని, టీడీపీ ప్రభుత్వం ఉంటే ఇలా ఉండేది కాదని చెప్పుకొచ్చారు. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్ర అభ్యంతరకరమని చంద్రబాబు మండిపడ్డారు. పవన్ ను నిత్యం బూతులు తిట్టడం, ఎదురు దాడి చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతలు మంత్రులు పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.