ఒత్తిడి తట్టుకోలేక, వేరేదారిలేక చివరకు వారాహి యాత్రకు పోలీసులు లైన్ క్లియర్ చేసినట్లుంది. ఈరోజు అంటే బుధవారం నుండి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర చేపట్టబోతున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలాకాలం క్రితమే ప్రకటించారు. ఒక పదిరోజుల క్రితమే 11 నియోజకవర్గాల్లో యాత్ర సాగబోతోందని వివరాలు కూడా అందించారు. అయితే పోలీసులు మాత్రం ఒకపట్టాన అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే తమకు మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు.
ఇక్కడే పోలీసులకు, జనసేన నేతలకు సమస్య వచ్చిపడింది. ప్రతి నియోజకవర్గంలో యాత్ర సజావుగా సాగేందుకు తాము పోలీసులతో మాట్లాడామని, యాత్ర రూట్ మ్యాపును కూడా అందించినట్లు నేతలంటున్నారు. ఓవరాల్ గా జిల్లాల ఎస్పీలకు కూడా విజ్ఞప్తులు అందించారు. డీటైల్డ్ గా యాత్ర వివరాలను అందించామని చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇచ్చిన వివరాలు సరిపోవని మరిన్ని వివరాలు కావాలని అడిగారు.
దాంతో రెండు వైపులా పంతాలు, పట్టింపులు పెరిగిపోయాయి. వారాహి యాత్రను భగ్నంచేయటానికే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు జనసేన ఆరోపణలు మొదలుపెట్టేసింది. అందుకనే యాత్రకు అనుమతికోసం కోర్టులో కేసు వేయటానికి కూడా రెడీ అయిపోయింది. అయితే చివరి నిముషంలో పోలీసులు కాస్త మెత్తపడటంతో కోర్టులో కేసు వేయాల్సిన అవసరం రాలేదు. జనసేన నేతలు పోలీసు అధికారులతో మాట్లాడిన తర్వాత మంగళవారం పొద్దుపోయిన తర్వాత యాత్రకు లైన్ క్లియర్ చేశారు.
దాంతో జనసేన నేతలు హ్యాపీగా ఫీలవుతున్నారు. చివరినిముషంలో యాత్రకు బ్రేకులు వేసినా, అనుమతులు నిరాకరించినా జరగబోయేదేమిటో పోలీసులకు అర్ధమైపోయినట్లుంది. ఎందుకంటే పవన్ కల్యాణ్ కూడా మంగళవారం రాత్రికే విజయవాడ నుండి రాజమండ్రి చేసుకునేశారు. ఉదయమే అన్నవరంకు చేరుకున్నారు. అన్నవరంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసిన తర్వాత వారాహిలో యాత్ర మొదలుపెడతారు. మొదటి మీటింగ్ ప్రత్తిపాడులోని కత్తిపూడిలో జరగబోతోంది. ఇపుడుగనుక ఏదో కారణంతో పోలీసులు అడ్డుపడితే పవన్ రోడ్డుమీదకు వచ్చేసే అవకాశముంది. పవన్ గనుక నిరసనగా రోడ్డుమీదెక్కితే జనాలను కంట్రోల్ చేయటం కష్టం. అప్పుడు యాత్ర మరోరూపంలో ఫోకస్ అవుతుందని అర్ధమైంది. అందుకనే చివరినిముషంలో క్లియర్ చేశారు.