మొండి కాదు జగమొండి అన్నట్లుగా ఉండే డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున అతడి మీద వస్తున్న నేరారోపణలు.. కేసుల నేపథ్యంలో మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవాలనుకుంటున్న అతడి కల నిజం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళ.. ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని.. తాను అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతానన్న విషయాన్ని తేల్చేశారు. అంతేకాదు.. తనకు కేసుల్లో శిక్ష పడినా సరే.. అధ్యక్ష ఎన్నికల రేసులో ఉండటం ఖాయమని తేల్చేయటం గమనార్హం.
జార్జియా.. ఉత్తర కరోలినాల్లో జరిగిన రిపబ్లికన్ల సదస్సులోఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష పదవి నుంచి దిగిపోయినప్పుడు పెద్ద ఎత్తున అధికారిక పత్రాలను తన ఇంటికి తీసుకెళ్లినట్లుగా అభియోగాలు ఆయనపై రావటం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరు కానున్నారు. ఇలాంటి వేళ.. పాల్గొన్న సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
తను చేస్తున్న ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ఒకటి తర్వాత ఒకటి చొప్పున విచారణ చేపడుతున్నారని.. అమెరికా ప్రజత అభీష్టాన్ని అణిచివేయటమే వారి అభీష్ఠంగా అభివర్ణించారు. ‘ఇదంతా నా వెంట పడటం కాదు. మీ వెంట పడటమే’ అంటూ ప్రజలను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించటం గమనార్హం. తనను ఎంతలా వేధింపులకు గురి చేసినా.. తాను ఎప్పటికి వదిలేది లేదన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. తనను తాను క్షమించుకుంటారా? అని ప్రశ్నించగా..అ లాంటి అవసరమే ఉందన్నారు. తాను ఎప్పుడూ తప్పు చేయలేదన్న ఆయన.. తనపై విచారణ వ్యవహారం అమెరికా చరిత్రలోనే అతి పెద్ద అధికార దుర్వినియోగానికి చిహ్నంగా మిగులుతుందన్నారు. రిపబ్లికన్ ను కావటం వల్లనే తన పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపించిన ఆయన.. తనకు శిక్ష పడినా తాను అధ్యక్ష ఎన్నికల రేసులో ఉండటం ఖాయమంటూ తేల్చేశారు.