వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలపై ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే పార్టీకి రెబల్ గా మారిన కోటంరెడ్డి…ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాహాటంగానే టిడిపి బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇచ్చి వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోటంరెడ్డి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
కోటంరెడ్డి నివాసానికి వెళ్లిన టీడీపీ నేతలు ఆయనతో సుదీర్ఘ మంతనాలు జర పడం నెల్లూరు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. కోటంరెడ్డితో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి భేటీ సుదీర్ఘ చర్చలు జరపడం జిల్లాలో తీవ్ర సంచలనం రేపుతుంది. ఈ చర్చల సందర్భంగా కోటంరెడ్డిని టీడీపీలోకి వీరు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
చాలా కాలంగా కోటంరెడ్డి టిడిపిలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. దాంతోపాటు, ఈ నెల 13న టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రకు ముందే కోటంరెడ్డి పసుపు కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి పాదయాత్రలో లోకేష్ తో పాటు కోటంరెడ్డి, ఆయన సోదరుడు పాల్గొంటే టిడిపికి మైలేజ్ పెరుగుతుందని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతో, నేడో రేపో కోటంరెడ్డి సైకిల్ ఎక్కుతున్నట్టుగా అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని నెల్లూరు రాజకీయాలలో ఊహగానాలు వినిపిస్తున్నాయి.