ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయురాలు, ఎమ్మెల్సీ కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవ పేర్లు వినిపించడం సంచలనం రేపింది. అయితే, ఆ ఆరోపణలను ముందు కొట్టివేసిన ఆ ఇద్దరు…ఈడీ నోటీసులు ఇవ్వడంతో ఖంగు తిని సైలెంట్ అయ్యారు.
ఇక, ఈ కేసులో రాఘవను ఈడీ కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాఘవకు బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. తన అమ్మమ్మ ఆరోగ్యం బాగోలేదని, ఆమెను చూసుకోవడానికి తాను తప్ప మరెవరూ లేరని రాఘవ తన బెయిలు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాఘవకు బెయిల్ మంజూరు అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాగుంట రాఘవకు ఈడీ షాక్ ఇచ్చింది.
రాఘవకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో ఈడీ సవాల్ చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు ఆ పిటిషన్ ను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది. అంతకుముందు, ఢిల్లీ హైకోర్టు రాఘవకు 15 రోజులపాటు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందేందుకు రాఘవ చూపిన కారణాలు సరిగా లేవని ఈడీ అభిప్రాయపడింది. తన సమీప బంధువుకు అనారోగ్యంగా ఉందని రాఘవ చెప్పిన విషయం అబద్ధమని ఈడీ అభిప్రాయపడింది. దీంతో, బెయిల్ లభించింది అన్న జోష్ లో ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవలకు షాక్ తగిలినట్టు అయింది.