ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం వైసీపీ నేతలకు అలవాటే అన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలకు ముందు జనం ఇళ్లముందు పడిగాపులు పడిన వైసీపీ ఎమ్మెల్యేలు…ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం ప్రజలకు తిట్లు, శాపనార్థాలు పెడుతున్నారు. మా కుటుంబమంతా మీకు సేవ చేస్తున్నా తృప్తి లేదంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల దుమారం సద్దుమణగక ముందే తాజాగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరులోని 9వ డివిజన్ లో ఇరుకు వీధిలో సైడ్ కాలువల నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యే ముస్తఫా వచ్చారు. తమ వీధిలో కాలువలు బాగున్నాయని వాటిని పగులగొట్టి కొత్త శంకుస్థాపనలు వద్దని ముస్తఫాను మహిళలు అడ్డుకున్నారు. కాలువలు పగలగొట్టవద్దని, ఆ నిధులను వేరే చోట వాడాలని కార్పోరేటర్ అశోక్ విజ్ఞప్తి చేశారు. స్థానిక కార్పోరేటర్ మాటలను వైసీపీ నేతలు పెడ చెవిన పెట్టి బాగున్న కాలువలను పడగొట్టాలనే నిర్ణయించారు.
దీంతో, ప్రజలు ఇబ్బందులు పడుతున్న చోట కాలువలు కట్టాలని, బాగున్న తమ వీధిలో కాలువలు పగలగొట్ట వద్దని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తమ డివిజన్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని డిమాండ్ చేస్తూ ముస్తఫాను అడ్డుకున్నారు. దీంతో, ఆ మహిళలపై ముస్తఫా మండిపడ్డారు. డివిజన్ ప్రజలు నాశనం కావాలంటూ శాపనార్థాలు పెట్టారు. ఇలా ఎమ్మెల్యే శాపనార్దాలు పెట్టడంపై డివిజన్ ప్రజలు, మహిళలు మండిపడుతున్నారు. ముస్తఫా తక్షణమే క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.