వారంతా వైసీపీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దక్కించుకున్నారు. కర్నూలు కార్పరేషన్ అధికారాన్ని పొందారు. అయితే.. నిధుల కేటాయింపు, అభివృద్ది విషయంలో వివక్ష చోటు చేసుకుంటోందన్న పాపానికి సొంత పార్టీ కార్పొరేటర్‌ను అత్యంత అవమానకర రీతిలో సభ నుంచి సాగనంపారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో వివక్షను ప్రశ్నించిన వైసీపీ కార్పొరేటర్ క్రాంతికుమార్‌పై కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో క్రాంతికుమార్ మాట్లాడుతూ తన డివిజన్‌కు నిధులు ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. ఆగ్రహించిన మేయర్ రామయ్య.. ‘ఇష్టానుసారంగా మాట్లాడితే సస్పెండ్ చేస్తా. ఓవరాక్షన్ చేయకు. వాణ్ని లాగి పడేయండి. ఈడ్చేయండి’ అని పోలీసులకు ఆదేశాలిచ్చారు. పోలీసులు క్రాంతికుమార్‌ను బయటకు తీసుకెళ్లేందుకు వచ్చి.. మెడపై చేయి వేసే ప్రయత్నం చేశారు.
దీంతో తీవ్ర వివాదం చెలరేగింది. అయినా.. కూడా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ‘మా డివిజన్లో అభివృద్ధి జరగలేదు. మేయర్ డివిజన్లో రూ.7 కోట్లతో పనులుచేస్తే మాకు అరకొరగా నిధులిచ్చారు. నేను ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధిని. ఏం తప్పు చేశానో చెప్పాలి’ అని నిలదీశారు. సహచర కార్పొరేటర్ల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మేయర్ వ్యాఖ్యలపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
పురుషుల మధ్యలో కూర్చోవాలని ఒత్తిడి చేస్తున్నారు!
మరోవైపు.. నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రమాదేవి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటూ వైసీపీ కార్పొరేటర్ విక్రమసింహారెడ్డి మేయర్‌కు ఓ లేఖ ఇచ్చారు. రమాదేవి సమాధానమిస్తూ ‘నేను విధుల్లో ఎక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించానో చెప్పాలి. విక్రమసింహారెడ్డి ఉదయం 5 గంటలకు ఫోన్ చేసినా స్పందించాను. ఉద్దేశపూర్వకంగానే అదనపు కమిషనర్ రామలింగేశ్వర్ ఆరోపణలు చేయిస్తున్నారు. పురుషుల మధ్యలో కూర్చోవాలని అంటున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు’ అని వాపోయారు. ఆపై ఆమె మాట్లాడేందుకు మైక్ ఇవ్వాలని అడగ్గా మేయర్, కమిషనర్ ఇవ్వలేదు. రమాదేవి విలపిస్తూ వెళ్లిపోయారు.