ఏపీ సీఎం జగన్.. మరోసారి గుంటూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు యంత్ర పరికరాలు ఇచ్చే వైఎస్సార్ యంత్రసేవ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే.. ఈ సందర్భంగా గుంటూరు ప్రజలు ముఖ్యమంత్రికి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. గతంలో గుంటూరుకు వచ్చినప్పుడు అనేక హామీలు కుప్పలు తెప్పలుగా ప్రకటించారని.. కానీ, ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదని వారు చెబుతున్నారు.
2022లో ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చి ఇచ్చిన హామీల్లో అమలైనవెన్ని. అడుగులు పడనివి ఎన్ని.. అని వారు ప్రశ్నిస్తున్నారు. అమలుకు నోచుకోని ఆర్భాటపు ప్రకటనలు.. నిధులిచ్చేస్తు న్నాం.. పనులు మొదలుపెట్టేస్తున్నాం.. అంటూ ఉత్తుత్తి హామీలు.. ఇస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ పై గుంటూరు ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఏడాదిన్నర క్రితం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పర్యటించిన సీఎం జగన్.. అడిగిందే తడవుగా వరాల జల్లు కురిపించారు.
వాటిల్లో ఏ ఒక్కపనీ ఇప్పటికీ మొదలుపెట్టలేదు. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ హామీల వర్షంతో ప్రత్తిపాడు ప్రజలు పులకించిపోయారు. రెండేళ్లలో ప్రత్తిపాడు స్వరూపమే పూర్తిగా మార్చేస్తానంటూ సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడే నిధులు విడుదల చేస్తున్నాం.. ఇక పనులు పరిగెత్తిస్తామంటూ ఊదరగొట్టారు. ఆ తర్వాత వైసీపీ నేతలు చేసే హడావుడి మాములుగాకనిపించలేదు. అన్న చెప్పాడంటే చేస్తాడంటూ మోతెక్కించారు.
కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం.. సీఎం సభలో ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలైన దాఖలాలు కనిపించడం లేదు. తాగునీటి సమస్య తీర్చేందుకు గుంటూరు ఛానెల్‌ను పొడిగిస్తామని.. 2 నెలల్లో పనులు పూర్తి చేస్తామని.. సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికి ఏడాదిన్నర పూర్తయినా.. పనులే మొదలు పెట్టలేదు. భూసేకరణకు నిధులివ్వకపోవడంతో ఈ హామీ అటకెక్కింది. సీఎం హోదాలోనే కాదు.. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలోనూ గుంటూరు కాల్వను పర్చూరు వరకు పొడిస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ప్రత్తిపాడులో తాగునీటి పథక కోసం 13 కోట్లు, ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనుల కోసం 7 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం చెప్పినా.. ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. తాగునీటి పథకానికి జలజీవన్ మిషన్ కింద కేంద్రం 11.60కోట్లు మంజూరు చేసినా ఆ పనులనూ మొదలుపెట్టలేదు. పెదనందిపాడులో క్రీడా వికాస కేంద్రం నిర్మాణానికి 2కోట్లు, సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం కోసం 7కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనానికి 2.8కోట్లు ఇస్తామంటూ బహిరంగ సభలో ప్రజలకు గొప్పలు చెప్పిన సీఎం జగన్.. ఏడాదిన్నర పూర్తయినా ఇప్పటికీ ఒక్క పైసా విదల్చలేదు.
కానీ అవన్నీ ఉత్తిత్తి హామీలుగానే మిగిలిపోయాయి. దీనిపైనే స్థానికులు మండిపడుతున్నారు. వేలాది మంది ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఎలా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రచారం కోసమే ప్రకటనలు తప్ప.. నిధులిచ్చేవి కావని ఎద్దేవా చేస్తున్నారు.