వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.. అధికార పగ్గాలు చేపట్టి.. నాలుగేళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేశారు. ప్రధానంగా ప్రజా వేదిక కూల్చివేతకు ఆదేశాలు ఇస్తూ `ఫస్ట్ డిమాలిషన్ విల్ స్టార్ట్ ఫ్రం దిస్ బిల్డింగ్` అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ మొదట చెప్పిన తమ విధ్వంస విధానాన్నే తాను, తన ప్రభుత్వం నిత్యం పాటిస్తున్నారు అంటూ సెటైర్ విసిరారు. మొదటి రోజు ప్రజా వేదిక కూల్చివేత నిర్ణయంతో మొదలైన రాష్ట్ర విధ్వంసం…. నాలుగేళ్లు పూర్తి చేసుకుని 5వ ఏట అడుగు పెట్టిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎంగా జగన్ ఇచ్చిన తొలి ఆదేశాలు… ప్రజా వేదిక కల్చివేత దృశ్యాలు ఉన్న వీడియోను చంద్రబాబు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇక, ఇటీవల కాలంలో వైసీపీ నేతలపైనా.. వైసీపీ ప్రభుత్వంపైనా తరచుగా విమర్శలు గుప్పిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చెబుతారా? అని ఆసక్తిగా అందరూ ఎదురు చూశారు. సీఎం జగన్ విధానాలను, ఆయన ప్రభుత్వంలోని లోపాలను తరచుగా పవన్ ఎండగడుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ పాలనకు నాలుగేళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ ఎలాంటి కామెంట్ చేస్తారా? అని జనసేన నాయకులు, కార్యకర్తలుఎదురు చూశారు. కానీ, అనూహ్యంగా పవన్ ఈ విషయంలో మౌనం వహించారు. బహుశ.. “జగన్ పాలనపై ఈ నాలుగేళ్లలో ఆయన చేసిన పాలనపై ఏముంది చెప్పడానికి“ అనే సందేశం ఇచ్చారా? అనే చర్చ సాగుతోంది.