తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు రోజుల పాటు టీడీపీ నిర్వహించిన మహానాడుపై వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. భజన పరులు అంటూ కామెంట్లు చేశారు. దీనిపై నెటిజన్లు ఆసక్తిగా స్పందిస్తున్నారు. మాటకు మాట అనేశారు. ఆసక్తిగా మారిన ఈ సంవాదం ప్రతి ఒక్కరినీ చదివిస్తోంది.
కొడాలి: ఎన్టీఆర్ వందవ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. ఈ వేడుకల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు తన భజన చేయించుకున్నారు. ఆ తర్వాత జగన్ పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. శత దినోత్సవ వేడుకలు అంటే ఇవేనా?
నెటిజన్లు: వైసీపీ నిర్వహించే కార్యక్రమాల్లో లోపాలు ఎవరైనా ఎత్తి చూపారా? జగన్ చేస్తున్న మోసాలపై ఎవరైనా వైసీపీ నేతలు ప్రశ్నించారా? ఆయనను తిట్టి దారిలో పెట్టే ధైర్యం ఉందా? ఏ పార్టీలో అయినా సొంత కార్యక్రమం అంటే.. ఇలానే ఉంటుంది నానీ గారు!!
కొడాలి: చంద్రబాబు రిలీజ్ చేసిన మ్యానిఫెస్టో బోగస్. 2014, 2019 నాటి మేనిఫెస్టోపై చర్చ పెడదాం. చంద్రబాబు ఏం అమలు చేశాడో? ఏపీ సీఎం జగన్ ఏం చేశారో చర్చిద్దాం.
నెటిజన్లు: అది సరే… ప్రస్తుతం మీరు అమలు చేస్తున్న మేనిఫెస్టోలో మద్య నిషేధం, ప్రత్యేక హోదా వంటివాటిపైనా చర్చిద్దాం.
కొడాలి: రైతు రుణమాఫీ అని చెప్పి కనీసం పది శాతం కూడా చేయలేదు. డ్వాక్రా రుణమాఫీ, కేజీ టు పీజీ ఉచిత చదువులు, నిరుద్యోగ భృతి అని చెప్పి ఏవైనా చేశారా? విద్యార్థులకు ల్యాప్టాప్లు ఇస్తానని చెప్పి ఇచ్చారా?
నెటిజన్లు: రైతులకు రూ.13 వేలు ఇస్తామని.. కేంద్రం నుంచి వస్తున్న పీఎం కిసాన్ సొమ్ము 6 వేలు తీసుకుని.. మిగిలిన 7 వేలు కలిపి ఇస్తున్నారుగా.. మరి మీరు మాట నిలబెట్టుకున్నారా? విదేశీ విద్యను అటకెక్కించారు. ల్యాప్టాప్లు మీరు ఎంతమందికిఇచ్చారు?
కొడాలి: మహిళలకు 15 వందలు ఇస్తానని అంటున్నారు. ఆల్రెడీ జగన్ ఇస్తున్నారు ఇక చంద్రబాబు ఇచ్చేదేంటి?
నెటిజన్లు : ఎవరికిఇస్తున్నారు? మీరేమైనా కలగన్నారా? కతలు చెబుతున్నారా? ఒక్కలెక్క చూపించండి.
కొడాలి: వార్డు సభ్యులుగా గెలవలేని వారు కూడా మహానాడు వేదిక మీద మమ్మల్ని దూషించారు. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలను కాపీ కొట్టుకొచ్చి ఇక్కడ హామీ ఇచ్చారు.
నెటిజన్లు: వైసీపీలో మాత్రం అందరూ గెలిచిన వారే మీడియా ముందుకు వచ్చిమాట్లాడుతున్నారా? సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడు గెలిచారు. మొత్తం ప్రభుత్వం అంతా ఆయన కనుసన్నల్లోనే నడవడం లేదా? సీఎం తర్వాత సీఎంగా మీరంతా ఒప్పుకోలేదా?