వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారం సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు వివేకా తల్లిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. దీంతో, సీన్ కర్నూల్ నుంచి హైదరాబాద్ కు మారింది. మరోవైపు, చంచల్ గూడ జైలులో ఉన్న అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రోజు తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ వ్యవహారంపై సీబీఐ అనుబంధ కౌంటర్ దాఖలు చేసింది. అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు అని రికార్డుల్లో సీబీఐ ఎక్కడా చెప్పలేదని ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. గుండెపోటు అని చెప్పినంత మాత్రం నేరం చేసినట్టేనని చెప్పడం సరికాదని వాదించారు.
ఈ కేసులో ఏ1 నిందితుడు గంగిరెడ్డికి వివేకానందరెడ్డితో భూ వివాదాలున్నాయని, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలకు వివేకాతో వజ్రాల వ్యాపారంలో విభేదాలు న్నాయని వాదనలు వినిపించారు. తమ కుటుంబ మహిళల విషయంలోనూ వారికి వివేకాపై కోపం ఉందని వాదనలు వినిపించారు. హత్య చేసిన దస్తగిరిని సీబీఐ వెనకేసుకొస్తోందని, దస్తగిరి ముందస్తు బెయిల్ ను సీబీఐ వ్యతిరేకించకపోవడమే అందుకు నిదర్శనమని వాదించారు. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ పై వివేకా కుమార్తె సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, దస్తగిరి బయట తిరుగుతుంటే సునీత స్పందించడంలేదని ఆయన అన్నారు
ఈ రోజు అవినాష్ రెడ్డి, సునీత తరఫు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం… రేపు సీబీఐ వాదనలు విననుంది. ఈ నేపథ్యంలో, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది.