అమరావతిలో రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను జగనన్న ఇళ్ల స్థలాల కోసం కేటాయించడంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. అమరావతిని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అక్కడ ఆర్-5 జోన్ క్రియేట్ చేసిన జగన్ 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నానంటూ సింపతీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతి రైతులు, టీడీపీ నేతలు, టీడీపీ సానుభూతిపరులు ఆ వ్యవహారంపై నిరసన తెలిపేందుకు నిన్న ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
అదే క్రమంలో ఆర్-5 జోన్ కు మద్దతుగా వైసీపీ నేతలు, మద్దతు ధరలు కూడా ర్యాలీ చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే తుళ్లూరులో 144 సెక్షన్ విధించడంతో ఆర్-5 జోన్ లో బందోబస్తుకు వచ్చిన కానిస్టేబుల్ ఒకరు పాముకాటుకు గురై మరణించడం విషాదాన్ని మిగిల్చింది. ఈ క్రమంలోనే ఈ ఘటననపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు సరైన వసతి ప్రభుత్వం కల్పించలేదని, అందుకే పవన్ ప్రాణాలు విడిచారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ దౌర్జన్యాలకు, దాస్టికాలకు పోలీసులను అడ్డుపెట్టుకోవడమే వైసీపీ ప్రభుత్వం పని అని, వారి క్షేమం గురించి ఈ ప్రభుత్వం ఆలోచించడం లేదని విమర్శలు గుప్పించారు. పవన్ కుమార్ మృతికి తన సంతాపాన్ని తెలుపుతున్నానని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. పవన్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మరోవైపు, ఈ నెల 27 28 తేదీలలో రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ఈనెల 27న టిడిపి ప్రతినిధుల సభ, 28న మహానాడు జరగనుంది. టిడిపి మహానాడును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు హాజరుకావాలని డిజిటల్ సంతకంతో చంద్రబాబు ఆహ్వానాలు పంపుతున్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి ఎన్టీఆర్ చాటి చెప్పారని, రాష్ట్ర దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పులకు ఆయన నాంది పలికారని చంద్రబాబు ప్రసంగించారు.