“అధికారం ఉందని.. చట్టాలను మీ మూతి మీద మీసంలా తిప్పుతామంటే ఎలా?!“- అసెంబ్లీలో విపక్ష నాయకుడిగా అన్నగారు ఎన్టీఆర్ నాటి కాంగ్రెస్ పాలకులను నిలదీసిన వ్యవహారం.. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పాలనను చూశాక స్ఫురణకు వస్తోందని అంటున్నారు సీనియర్ రాజకీయ నేతలు. దీనికి కారణం.. అమరావతి రాజధాని పరిదిలో రైతులు ఆందోళన చేస్తున్నారని.. పేర్కొంటూ.. ప్రభుత్వం వెంటనే అక్కడ 144 సెక్షన్ను విధించేసింది. ప్రజలు గుమిగూడ వద్దని.. చర్చలు పెట్టొద్దని, సమావేశాలు ఉండొద్దని.. నిరసనలకు అసలు తావేలేదని తేల్చి చెప్పింది.
మరి అదేసమయంలో కర్నూలులో సీఎం జగన్ తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి మాతృమూర్తి శ్రీలక్ష్మి వైద్యం పొందుతున్న విశ్వభారతి ఆసుపత్రి వద్ద వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి.. ఎంపీకి సంఘీభా వంగా అక్కడే తిష్ఠవేశారు. అంతేకాదు.. విధుల్లో భాగంగా వీరిని చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడుతు న్నారనే వాదన వినిపిస్తోంది. మరి ఇంత జరుగుతున్నా.. అక్కడ మాత్రం పోలీసులుకానీ.. ఇతర ప్రభుత్వ పెద్దలుకానీ. . ఎలాంటి సెక్షన్లు విధించకపోవడంపై సీనియర్ రాజకీయ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాల్సిన రోజులు పోయాయి. కనీసం.. ఉన్న చట్టాన్నయినా సక్రమంగా అమలు చేయాలి కదా? అని ప్రశ్నిస్తున్నారు. రాజధానిలో తాము అమరావతి కోసం ఇచ్చిన స్థలాలను ఆర్5 జోన్ పేరుతో పేదలకు పంచుతుండడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటికే కట్టి రెడీగా ఉన్న టిడ్కో ఇళ్లను అక్కడే ఇచ్చినా.. తమకు అభ్యంతరం లేదని.. కానీ, తాము రాజధాని కోసం ఇచ్చిన భూములను ఎలా పంచుతారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే సర్కారుకు రైతులపై అక్కసుగా మారింది. దీంతో మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేయడం.. ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగిపోయాయి.
మరి అదేసమయంలో కర్నూలులో విధుల కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం.. కెమెరాలు లాక్కోవడం.. కనీసం.. ఫొటోలు తీసేందుకు కానీ.. ఇక్కడి పరిస్థితిని కవర్ చేసేందుకు కానీ అనుమతించకపోవడం వంటివి ఏంటనేది సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్న ప్రశ్న. మరి నిజానికి అమరావతిలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇక్కడకూడా అంతే ఉంది. మరి ఇక్కడ కూడా సెక్షన్ 144 విధించాలి కదా! కానీ, ఆ ఊసు మాత్రం సర్కారుకు పట్టడం లేదు. తమ్ముడుకో న్యాయం.. రైతులకు మరో న్యాయం అన్నట్టుగా పరిస్థితి ఉందని అంటున్నారు సీనియర్ రాజకీయ నేతలు.