వ్యభిచారంపై ముంబైలోని సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వ్యభిచారం చేయడం నేరం కాదని, కానీ బహిరంగ ప్రదేశాలలో వ్యభిచారం చేస్తే అది నేరం కింద పరిగణించాల్సి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొద్ది రోజుల క్రితం ముంబైలోని ఓ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
వ్యభిచారం చేస్తున్నారన్న కారణంగా ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని వారిలో ఇద్దరినీ విడిచిపెట్టగా మరొక మహిళని మాత్రం ఏడాది పాటు సంరక్షణ కేంద్రంలో ఉండాల్సిందిగా మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పును సదరు మహిళా ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ మహిళ కేసు పై విచారణ జరిపిన ముంబై సెషన్స్ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆ మహిళను సంరక్షణ కేంద్రం నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
బాధితురాలు మేజర్ అని, సరైన కారణం చెప్పకుండా ఆమెను సంరక్షణ కేంద్రంలో నిర్బంధించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం భారతదేశ పౌరులు ఈ దేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా నివసించే, తిరిగే హక్కు ఉందని న్యాయమూర్తి వెల్లడించారు. ఆమె హక్కులకు భంగం కలిగించడం సరికాదని చెప్పారు. ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసినట్టుగా పోలీసులు తమ నివేదికలో ఎక్కడ పేర్కొనలేదని, అటువంటి సందర్భంలో వ్యభిచారం నేరం కాదని తీర్పునిచ్చారు. బహిరంగ ప్రదేశాలలో వ్యభిచారం చేస్తే అది నేరమని చెప్పారు.