వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యవహారం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరు కాకపోవడం తన తల్లి అనారోగ్య కారణాన్ని సాకుగా చూపి ఈనెల 27 తర్వాత విచారణకు వస్తానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు తనను సీబీఐ అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. తనను అరెస్టు చేయకుండా సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఈనెల 25న అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో అవినాష్ దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.
కానీ, అరెస్టు చేయకుండా సిబిఐని ఆదేశించలేమంటూ సుప్రీంకోర్టు క్లారిటీనిచ్చింది. అయితే, సీబీఐ నోటీసులకు అవినాష్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాష్ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తాజాగా, సుప్రీంకోర్టులో అవినాష్ కు చుక్కెదురు కావడంతో ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో సిబిఐ అధికారుల రియాక్షన్ ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి విచారణకు హాజరైతే అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈ విచారణ సందర్భంగా సిబిఐ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు హాజరు కాకపోవడం విశేషం.