‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోలేని పాత్రల్లో ఒకటి విలన్ పాత్ర. వెండితెర మీద ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క గుండెను మండేలా చేసిన ఈ ప్రాతలో జీవించారు హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్. 58 ఏళ్ల ఈ నటుడు ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత స్కాట్ దొరగా సుపరిచితుడయ్యారు. తాజాగా ఆయన కన్నుమూశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో గవర్నర్ స్కాట్ బక్స్ టన్ పాత్రను పోషించిన ఆయన ఆకస్మికంగా మరణించటం జీర్ణించుకోలేనిదిగా మారింది. ఆయన మరణానికి కారణం ఏమిటన్న విషయంపై స్పష్టత రాలేదు. తన పుట్టినరోజుకు రెండు రోజుల ముందు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన ఆయన మరణం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
థోర్ సిరీస్ లో పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న ఆయన మరణ వార్తను విన్న వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణ వార్త తెలిసినంతనే ప్రపంచ వ్యాప్తంగా ఆయన్ను అభిమానించే వారు విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. పలువురు ఆయన మరణంపై ట్వీట్ చేస్తున్నారు. స్టీవెన్సన్ మరణంపై ఆర్ఆర్ఆర్ టీం షాక్ కు గురైంది. ‘ఈ వార్త మమ్మల్ని ఎంతో షాక్ కు గురి చేసింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరెప్పటికీ మా మనసుల్లో నిలిచే ఉంటారు’ అంటూ ట్వీట్ చేసింది.
నార్త్ ఐర్లాండ్ లోని లిస్ బర్న్ లో 1964 మే 25న జన్మించిన ఆయనకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఎనిమిదేళ్ల వయసులో బ్రిటిష్ ఓల్డ్ విక్ థియేటర్ స్కూల్ లో ఆడ్మిషన్ పొందిన ఆయన.. 29 ఏళ్లకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లలో మొదట టీవీ షోల్లో నటించారు. తర్వాత హాలీవుడ్ చిత్రాల్లో అవకాశాలు లభించాయి. 1998లో తొలిసారి థియరీ ఆఫ్ ఫ్లైట్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత బోలెడన్ని సినిమాల్లో నటించారు.
థోర్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యారు. డెక్స్ టార్.. స్టార్ వార్స్ రెబెల్స్ లాంటి టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆయన చివరగా నటించింది మాత్రం డిస్నీ ప్లప్ అశోకా. ఈ సిరీస్ త్వరలో విడుదల కానుంది. 1997లో రూత్ గెమ్మెల్ అనే హాలీవుడ్ నటిని పెళ్లాడిన ఆయన.. మనస్పర్థల కారణంగా 2005లో విడాకులు తీసుకున్నారు. అనూహ్యంగా ఆయన మరణవార్త సినీ అభిమానుల్ని విషాదంలో ముంచెత్తుతోంది.