ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. తాజా గా మాజీ ఎంపీ, ఇటీవల బీఆర్ ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడ్డ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా అని అని వ్యాఖ్యానించారు. పొంగులేటి త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చెప్పారు. “పొంగులేటి చెప్పకపోయినా నేను చెబుతున్నా రాస్కోండి. పార్టీ మారిన తర్వాత పొంగులేటికి కేసీఆర్ విలువ తెలుస్తుంది“ అని పువ్వాడ వ్యాఖ్యానించారు.
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొంగులేటినే బచ్చా అని అన్నారు. పిట్టల దొర లాగా. పొంగులేటి ఫ్రస్టేషన్లో ఉన్నాడని అజయ్ వ్యాఖ్యానించారు. పిట్టలదొరలాగా రోజూకో వేషం వేస్తున్నాడని, అలాంటి పిట్టల దొర మాటలకు భయపడే రకం కాదని చెప్పుకొచ్చారు. ఖమ్మం లో తనపై బచ్చాగాడిని ఎవడినైనా నిలబెడుతానని పొంగులేటి అంటున్నాడని, ఎవరినైనా నిలబెట్టు.. నేను చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది అని పువ్వాడ ధీమా వ్యక్తం చేశారు.
పొంగులేటి సీఎం సీటు కోసం ఆశలు పెట్టుకున్నాడని, సీఎం కావాలంటే ఓ చరిత్ర కావాలని అజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. వందల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఎన్నెస్పీ కెనాల్ పనులలో దోపిడీ చేసిన విషయం మర్చిపోయావా బిడ్డా అని అన్నారు. “ఆ కేసులెక్కడికీ పోలేదు. రేపు రా బిడ్డా.. నీ చేతిలో మోసపోయిన సబ్ కాంట్రాక్టర్లు ఖమ్మం వస్తున్నారు. డబ్బుందనే మదంతో విర్రవీగుతున్నావు. నీ డబ్బు ఖమ్మం ప్రజలకు ఎడమ కాలు చెప్పుతో సమానం“ అని మంత్రి నిప్పులు చెరిగారు.
“ఖమ్మంలో నాకు దమ్ము ఉంది. అరాచక శక్తులను అణచివేశా. రౌడీ షీటర్లను అణచివేశా. మట్టి దందా అంటున్నావు. నా మనుషులు ఎవరు దందా చేశారో నిరూపించే దమ్ము ఉందా?“ అని అజయ్ సవాల్ రువ్వారు. ఎంపీగా ఖమ్మం ప్రాంతానికి పొంగులేటి చేసిన మేలేంటని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఎన్నికలలోనూ పార్టీ అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కాగా, ఇటీవల పొంగులేటి మాట్లాడుతూ.. మంత్రి పువ్వాడ అజయ్ పై తాను పోటీ చేయనని, అతనిపై బచ్చాగాన్ని పెట్టైనా గెలిపిప్తానని వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్యా రాజకీయ వివాదం ముసురుకోవడం గమనార్హం.