సాఫ్ట్ వేర్ నుంచి టెక్ వరకు ఈ ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి. ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో.. కూడా అంచ నా వేయలేని పరిస్థితి వచ్చింది. సాధారణంగా ఉద్యోగాలు అంటే..ఒక భరోసా.. నెల నెలా ఇంత ఆదాయం వస్తుందనే లెక్కలు ఉంటాయి. అది గవర్నమెంటు అయితే.. ఎక్కువ, ప్రైవేటు అయితే.. తక్కువ భరోసా. కానీ, ఉద్యోగం దీమానే వేరు. అయితే.. ఇప్పుడు.. టెక్ ఉద్యోగాలకు కాలం మూడిందనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఈ ఉద్యోగుల జాతకాలు ఏమీ బాగోలేదనే టాక్ వినిపిస్తోంది.
లక్షలాది మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు.. తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ ఏడాది కేవలం ఇప్పటి గడిచిన నాలుగు మాసాల్లోనే ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. దీంతో వచ్చే 8 మాసాల పరిస్థితి ఏంటని.. ప్రస్తుతం కొలువుల్లో ఉన్నవారు కల్లోలంలో మునిగిపోయారు. తాజా అంచనాలను బట్టి.. వచ్చే మరికొన్ని నెలల పాటు లే ఆఫ్లు కొనసాగనున్నాయని తెలుస్తోంది. చిన్న చితకా కంపెనీల సంగతి అలా ఉంచితే.. పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలే .. ఉద్యోగుల భారాన్ని తగ్గించుకునే చర్యలు చేపట్టాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఈ నాలుగు మాసాల్లో 2 లక్షలకు పైగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఫట్ మన్నాయి. తాజాగా ఉద్యోగాల ఏరివేతకు సంబంధించి (లే-ఆఫ్స్ పై ట్రాకింగ్) ఓ సంస్థ వేసిన అంచనా ప్రకారం.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగ్ 695 కంపెనీలు లక్షా 98 వేల మంది ఉగ్యోగుల్ని తొలిగించాయనే దిగ్భ్రాంతికర వాస్తవాన్ని బయట పెట్టింది. అది కూడా ఈ నాలుగు మాసాల్లోనే కావడం మరింత విచారకరం!!
నిజానికి కరోనాకు ముందు.. కూడా టెక్ ఉద్యోగాలకు గ్యారెంటీ ఏమీలేదు. వన్స్ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లాక.. తెల్లారి తిరిగి ఆఫీసుకు వచ్చే వరకు గ్యారెంటీ లేని ఉద్యోగాలుగా పేరు వచ్చింది. అయితే.. కరోనా తర్వాత.. ఈ పరిస్థితి మరింత పెరిగింది. పనిచేస్తున్న సమయంలోనే “ఇక, చాలు వెళ్లండి!“ అనే సందేశాలు వస్తున్నాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 1046 టెక్ కంపెనీలు, లక్షా 61వేల మంది ఉద్యోగుల్ని తొలిగించగా.. ఈ ఏడాది ఒక్క జనవరి నెల్లోనే దాదాపు లక్ష ఉద్యోగాలు పోయాయి.
అన్నీ దిగ్గజ కంపెనీలే!
ఉద్యోగాలు తీసేస్తున్న జాబితాలో ఉన్నవన్నీ.. దిగ్గజ కంపెనీలే కావడం గమనార్హం వీటిలో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సేల్స్ ఫోర్స్.. వంటివి ఉన్నాయి. 2022 జనవరి నుంచి ఈనెల వరకు ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల 60 లక్షల మంది ఉద్యోగులను ఆయా కంపెనీలు ఇంటికి పంపించాయి.
తాజాగా మరిన్ని కంపెనీల నిర్ణయం
ఉద్యోగులను ఇంటికి పంపించే కంపెనీల జాబితాలోకి తాజాగా మరికొన్ని కంపెనీలు వచ్చి చేరాయి. వీటిలో ఆశ్చర్యకరంగా టెలికాం కంపెనీలు ఉన్నాయి. వోడాఫోన్, బీటీ లాంటి సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగుల్ని వదిలించుకోవడానికి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసి పెట్టుకున్నాయి. సో.. టెక్ ఉద్యోగాల ఫటక్ పరిస్థితి ఇలా ఉంది!!