స్టార్ హీరోలు లేరు. హీరోయిన్లు లేరు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు సీనియర్ నటుడు నరేశ్.. క్యారెక్టర్ ఆర్టిస్టు పవిత్ర. నరేశ్ నిర్మించిన ఈ మూవీకి ఆయన రెమ్యునరేషన్ ఎంతన్నది పక్కన పెడితే.. మిగిలినవారికి.. సినిమా నిర్మాణానికి అయిన ఖర్చు లెక్క విన్నంతనే విస్మయానికి గురి కావటం ఖాయం. రెండు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే అందరిని ఆకర్షించటంతోపాటు.. హాట్ టాపిక్ గా మార్చటంలో నరేశ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి.
ఈ నెలాఖరులో విడుదల కానున్న ఈ మూవీకి ప్రమోషన్ చేయటంలో బిజీగా ఉన్నారు నరేశ్. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మళ్లీ పెళ్లి మూవీ బడ్జెట్ మూవీ కాదని.. భారీగానే ఖర్చు చేసిన విషయాన్ని వెల్లడించటం గమనార్హం. ఈ సినిమాను తాను రివేంజ్ కోసం తీసినట్లుగా ప్రచారం జరుగుతున్న వైనాన్ని ఖండించారు.
రివేంజ్ కోసం సినిమా తీస్తారా? ఒకరిపై రివెంజ్ తీర్చుకోవాలంటే యూట్యూబ్ వేదికగా వారిని విమర్శిస్తూ వీడియోలు షేర్ చేయొచ్చని.. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయొచ్చని.. అంతేకానీ రూ.15 కోట్లు పెట్టి రెండు భాషల్లో ఒక సినిమా చేయాల్సిన అవసరం లేదన్నారు. తన మాటలతో మళ్లీ పెళ్లి సినిమా ఏదో బడ్జెట్ మూవీ కాదు.. భారీ సినిమానే అన్న విషయాన్ని తన మాటలతో స్పష్టం చేశారని చెప్పాలి. సూపర్ డూపర్ హిట్ అయి.. సంచలన కలెక్షన్లు సాధించిన కాంతారా మూవీ బడ్జెట్ కు మించి మళ్లీ పెళ్లి ఉండటం విశేషం. మరి.. దీనికి ప్రేక్షకాదరణ ఎంతన్నది చూడాలి.