టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు.. విజయనగరం జిల్లా టీడీపీ రాజకీయ పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని… వ్యాఖ్యా నించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు.. ఇప్పుడు పార్టీని నిలబెట్టేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. నిజమే! విజయనగరం జిల్లా పరిస్థితి ఇలానే ఉంది. కోళ్ల లలిత కుమారి.. సహా పలువురు నాయకులు.. పార్టీని వాడుకున్నవారే. అదేవిధంగా వైసీపీ నుంచి వచ్చి.. టీడీపీలో చేరిన సుజయ్ కృష్ణ రంగారావు కూడా మంత్రి పదవి అనుభవించారు.
గత ఎన్నికల్లో ఓడిపోగానే పార్టీవైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక, ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ భారం అంతా.. ఒక్కరే మోయాల్సి వచ్చింది. ఈ పరిణామం నిజంగానే పార్టీని అంటిపెట్టుకుని ఉన్న.. సీనియర్లుగా చలామణి అవుతున్న వారికి ఆవేదన కలిగించేదే. దీనిని కాదనే సమస్యేలేదు. కానీ, ఇక్కడే కొన్ని మౌలిక ప్రశ్నలు వస్తున్నాయి. దాదాపు పాతిక సంవత్సరాలుగా విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఇదే అశోక్ గజపతిరాజుకు.. ఈ వ్యవహారంలో పాత్రలేదా? ఆయన ప్రమేయం ఏమీ లేకుండానే నాయకులు పార్టీకిదూరమయ్యారా? ఆయన సమర్ధుడే అయినప్పటికీ.. పార్టీని ఇతర నేతలే పాడుచేస్తున్నారా? అనే ప్రశ్నలకు కూడా సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది.
ఏమాటకు ఆమాట చెప్పాల్సి వస్తే.. టీడీపీలోనూ వ్యక్తిపూజకు ప్రాధాన్యం పెరిగింది విజయనగరం జిల్లా నుంచే. తనను మెచ్చుకుంటూ.. తన పేరిట పుట్టినరోజులు, పెళ్లిరోజులు.. వంటివాటికి భారీ ఎత్తున ప్రకటనలుఇస్తూ.. భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తూ.. తనను పొగిడిన వారికి అశోక్ ప్రాధాన్యం ఇవ్వలేదా? జిల్లా అధ్యక్ష బాధ్యతలను పట్టుకుని.. అయిన వారికి పదవులు కట్టబెట్టి.. సీట్లు ఇప్పించుకోలేదా? అదేసమయంలో గెలుపు గుర్రాలు అని తెలిసి కూడా కొందరిని తొక్కేయలేదా? అనే ప్రశ్నలకు ప్రత్యేకంగా ఎవరూ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.
అంతా నాకు తెలిసే చేయాలి! అనే హుకుం.. పార్టీ కార్యాలయాన్ని సైతం తన ఇంట్లోనే నడుపుకొన్న విధానంపై విమర్శలు వచ్చినా.. సరిదిద్దుకునే ప్రయత్నం చేయని పాపం.. ఎవరిది? స్థానిక ఎన్నికల్లో కూడా తన హవానే సాగాలని .. తనవారికే వార్డులను చైర్మన్ గిరీ హామీలను ఇచ్చుకున్నది అశోక్ కాదా? తీరా పార్టీ ఓడిపోయింది కనుక, ఇప్పుడు పార్టీలో పరిస్థితి బాగోలేదు కనుక.. తన పీకలమీదకు వస్తుందనే ఒక విధమైన ఆందోళనతోనే .. ఇప్పుడు తప్పులు పక్కవారిపై నెట్టేసి.. చేతులు దులుపుకోవడం సరైందేనా? అనే సీనియర్ల గుసగుస వెనుక పక్కా నిజం ఉంది. కుటుంబ రాజకీయాలు, ఆధిపత్య ధోరణి.. వంటివి విజయనగరం టీడీపీని నాశనం చేశాయని ఇప్పటికైనా ఒప్పుకొని ఉంటే.. నాయకులు సంతృప్తి చెందే వారు. కానీ, ఇప్పుడు కూడా ఎదురు దాడినే ఎంచుకుంటే. ఎవరు మాత్రం పార్టీని బాగుచేయగలరు!