వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా పెండింగ్ లో ఉంది. కోర్టుకు సమ్మర్ వెకేషన్ హాలిడేస్ ఉన్నందున ఆ పిటిషన్ విచారణను జూన్ 5కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. అయితే, ఈలోగానే అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ వ్యవహారాల నేపథ్యంలో తాజాగా అవినాష్ రెడ్డి మరోమారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వేసవి విరామానికి ముందే తన బెయిల్ వ్యవహారాన్ని తేల్చాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సమ్మర్ వెకేషన్ బెంచ్ ముందుకు తన ముందస్తు బెయిల్ పిటిషన్ తీసుకువెళ్లాలని కోరారు. అయితే, ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ పిటిషన్ విచారణ తేదీని సుప్రీం నిర్ణయించలేదు. అత్యవసర విచారణ కావాలంటే లిఖితపూర్వక పిటిషన్ ఇవ్వాలని, అపుడు దానిని పరిశీలిస్తామని అంటున్నారు.
మరోవైపు, హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి వైఎస్ సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వెళ్లారు. సీబీఐ అధికారుల పిలుపు మేరకు వారు అక్కడికి వెళ్లారని, వివేకా హత్యకు సంబంధించిన కేసులో వివిధ అంశాలపై ప్రశ్నించేందుకు వారిని పిలిచారని తెలుస్తోంది.