అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన ఏక్ నాథ్ షిండే వర్గానికి దేశ అత్యున్నత న్యాయస్థానం షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఉద్దేవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని.. ఆయన రాజీనామా చేయకుంటే తాము తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాల్ని ఇచ్చి ఉండేవాళ్లమని పేర్కొంది. అంతేకాదు.. షిండే వర్గానికి చెందిన భరత్ గోగవాలే ను విప్ గా నియమిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టింది. అనర్హత ఎదుర్కొంటున్న ఒక స్పీకర్ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఎమ్మెల్యేపై దాఖలైన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉందా? లేదా? అన్నది స్పష్టం చేయాలని కోరుతూ విస్తృత స్థాయి ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఒక లేఖను ఆధారంగా చేసుకొని ఉద్దవ్ ఠాక్రేకు మద్దతు లేదని చెప్పటం సరికాదని పేర్కొంది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తాజాగా తన తీర్పును వెలువరించింది. బీజేపీ మద్దతుతో ఏర్పాటు చేసిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాము జోక్యం చేసుకోమని సుప్రీం పేర్కొంది. ఉద్దవ్ ఠాక్రే విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేయటాన్ని ఇందుకు కారణంగా వెల్లడించింది.
ఒక లేఖ ఆధారంగా గవర్నర్ ప్లోర్ పరీక్షకు అనుమతించటం తప్పని చెప్పిన సుప్రీం.. ఒకవేళ ఉద్దవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఉండి ఉండకుంటే.. ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేయాలన్న ఆదేశాల్ని ఇచ్చే వాళ్లమని ధర్మాసనం చెప్పింది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి చీలిన ఏక్ నాథ్ షిండే వర్గానికి అనుకూలంగా అప్పటి స్పీకర్.. గవర్నర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు ఉన్నాయి.
ఏక్ నాథ్ షిండే ప్రభుత్వ ఏర్పాటు మీద ఫిబ్రవరి 21 నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసును విచారిస్తోంది. ఉద్ధవ్ తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్.. డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ.. దేవదత్ కామత్ లు వాదనలు వినిపించారు. మరోవైపు ఏక్ నాథ్ షిండే తరఫున సీనియర్ లాయర్లు.. నీరజ్ కిషన్ కౌల్.. హరీశ్ సాల్వే.. మహేశ్ జెఠ్మలానీ.. మనిందర్ సింగ్ లు వాదనలు వినిపించారు.మహారాష్ట్ర గవర్నర్ తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పలు పిటిషన్లను కలిపి విచారించిన ఐదుగురు సభ్యులతోకూడిన ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహా సర్కారుకు షాకిచ్చేలా మారాయి.