రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే “పార్మర్స్ సఫరింగ్ ఇన్ ఏపీ” హ్యాష్ టాగ్ దేశవ్యాప్తంగా ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రంలోని రైతుల కష్టాలను చాటుతూ.. ప్రభుత్వం విధానాలను ఎండగడతూ పలు ట్వీట్లు పెడుతున్నారు. ఈ విషయాన్ని పేర్కొంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
“అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతుల బాధలను పట్టించుకోని సీఎం జగన్కు కనువిప్పు కలగాలి అంటూ.. నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. రైతన్నల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అయినా.. ఈ ప్రభుత్వానికి బుద్ధిలేదు“ అని బాబు అన్నారు. 15జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరికి జగన్ ఎందుకు వెళ్లేలేదన్నారు. రాష్ట్రంలో అన్నదాతల ఆక్రందన.. రేపు పెను ఉప్పెన అవుతుందని.. ఆ ఉప్పెనలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోక తప్పదని చంద్రబాబు మండిపడ్డారు.
రాష్ట్రంలోని రైతులు బాధల్లో ఉన్నారని.. Farmers Suffering in AP అని టీడీపీ చేసిన యాష్ టాగ్ ట్విటర్లో ట్రెండవుతోందని తెలిపారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని.. దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రబీకి పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.