కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 6 గంటలతో తెరపడుతుంది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో పాగా వేసేందుకు కాంగ్రెస్, బీజేపీలతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు శక్తి వంచన లేకుండా ప్రచారం చేశాయి. కష్టపడ్డాయి. ప్రజలకు తాయిలాలు ప్రకటించాయి. ఉచితాలకు తాము వ్యతిరేకం అని కోర్టుకు చెబుతూనే.. నందిని పాల నుంచి బియ్యం వరకు.. పింఛన్ల నుంచి గ్యాస్ వరకు కూడా బీజేపీ ఉచితాలు ప్రకటించింది. ఇక, కాంగ్రెస్ తనదైన శైలికి భిన్నంగా ఈ సారి సంచలన నిర్ణయాలు ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ముస్లిం రిజర్వేషన్లను 4 నుంచి 6 శాతానికి పెంచడం.. భజరంగ్‌దళ్‌ను నిషేధించడం సహా.. అనేక సంచలన హామీలు ఇచ్చింది. అధికారంలోకి వస్తూనే రెండున్నర లక్షల మంది నిరుద్యోగు లకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొంది. దీంతో బీజేపీ-కాంగ్రెస్‌ల దూకుడు మామూలుగా లేదుగా అనే టాక్ జోరుగా వినిపించింది. ఇదిలావుంటే, బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెడితే.. ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండు రోజులు చేసిన రోడ్ షోలు బీజేపీకి జోష్ పెంచాయి సుదీర్ఘ యాత్రల్లో ఆయన ప్రత్యేకంగా ఇచ్చిన హామీలు ఏమీలేకపోవడం.. చర్చనీయాంశం.
అంతేకాదు.. కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆయన తూర్పారబడుతూనే ఎన్నికల ప్రచారం చేయడం.. యాత్రలు నిర్వహించడం.. మరింత విశేషం. ఇక, బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం.. ఎన్నికల ప్రచారంలో ప్రత్యేకంగా ఇచ్చిన హామీలు లేవు. కేవలం కాంగ్రెస్ మేనిఫెస్టోపై విమర్శలు సంధించడం.. ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం మినహా ఆయన చేసిందికూడా ఏమీలేదు. ఒకరకంగా చెప్పాలంటే.. బీజేపీ ప్రచార ఆర్భాటం స్పష్టంగా కనిపించింది. అయితే.. ప్రజల సెంటిమెంటును ఏ రకంగా ఈ ఎన్నికలు మలుపు తిప్పనున్నాయనేది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. చూడాలి.. గెలుపు ఎవరిదో!!