సీఎం జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోందన్న విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల అనంతపురంలో జగన్ కాన్వాయ్ ను కొందరు ప్రజలు అడ్డుకోవడం సంచలనం రేపింది. ఆ ఘటన మరువక ముందే జగన్ కు తాజాగా మరో షాక్ తగిలింది. విశాఖ పర్యటనకు రాబోతున్న జగన్ కు అక్కడి ప్రజలు కొందరు సెటైరికల్ ఫ్లెక్సీలతో షాకిచ్చారు. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం సుస్వాగతం …అంటూ వైఎస్ జగన్ పై జనజాగరణ సమితి సభ్యులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైనం వైరల్ గా మారింది.
విశాఖకు విచ్చేస్తున్న రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటూ నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుమారుడిని, కోడలిని ఆశీర్వదించేందుకు జగన్ విశాఖ రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఎంవీవీ ఇంటికి వెళ్లే మార్గంలో ఈ తరహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కొందరు నిరసన తెలిపారు. దీంతో, విశాఖలో వైసీపీ నేతలకు షాక్ తగిలినట్లయింది.
కాగా, కొద్ది రోజుల క్రితం అనంతపురంలో జగన్ కు జనం నుంచి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలోని పోతుల నాగేపల్లి వద్ద జగన్ కు రైతుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం జగన్ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు కొందరు రైతులు ప్రయత్నించారు. ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి వద్ద జగన్ కాన్వాయ్ కు రైతులు అడ్డుపడ్డారు. దీంతో, భద్రతా సిబ్బంది రైతులను పక్కకు తప్పించి జగన్ కాన్వాయ్ ని ముందుకు పంపించారు.
పేదలకు జగనన్న ఇళ్ల కోసం 200 ఎకరాలు సేకరించారని, కానీ దానికి ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని రైతులు మండిపడ్డారు. అందుకే, తాము జగన్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని, కానీ పోలీసులు తమను తోసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలోని నార్పలలో జరిగిన జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే, నార్పల నుండి పుట్టపర్తికి జగన్ ను తీసుకువెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో, జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తికి ప్రయాణించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి వద్ద జగన్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది.