ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలు ఎవరికివారు అధికారం చలాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత పార్టీలోనే నాయకులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాల్లో రెడ్డి వర్గం ప్రాధాన్యం పెరిగిపోయిందని.. సొంత పార్టీ ఎస్సీ నేతలను కూడా కనీసం గుర్తించడం లేదని.. పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం శింగనమల. దీనికి పెద్ద చరిత్రే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన సాకే శైలజానాథ్ ఇక్కడ నుంచి వరుస విజయాలు అందుకున్నారు.
2014లో టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే.. 2019లో మాత్రం వైసీపీ నాయకురాలు జొన్నలగడ్డ పద్మావతి గెలుపు గుర్రం ఎక్కారు. అయిఏ.. ఇప్పుడు ఇదే నియోజకవర్గంలో జొన్నలగడ్డ పద్మావతి భర్త.. ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న సాంబశివారెడ్డి వైఖరిపై ఎస్సీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ ఓట్లతో గెలిచి.. తన నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారనేది వారి ఆవేదన. ముఖ్యంగా ఎమ్మెల్యేను కలుసుకుందామన్నా.. తమ సమస్యలు చెప్పుకొందామన్నా.. కూడా భర్త సాంబశివారెడ్డి అనుమతి ఉండాల్సి వస్తోందనిఇదేం చోద్యమని వారు ప్రశ్నిస్తున్నారు.
నియోజకవర్గంలోనూ.. వైసీపీలోనూ కీలకంగా ఉన్న ఎస్సీ నాయకుడు చామలూరు రాజగోపాల్. నియోజకవర్గం ఎస్సీ నేతల్లో ఈయనకు బలమైన పట్టుంది. అయితే.. ఎమ్మెల్యే పద్మావతి భర్త సాంబశివారెడ్డి తీరుపై ఆయన తీవ్ర ఆవేదన , ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశమివ్వాలని కొన్ని రోజులుగా సాంబశివరెడ్డిని వేడుకుంటున్నా కూడా తనను ఏమాత్రం పట్టించుకోలేదని కన్నీటిపర్యంతమైయ్యారు. “ఏం చేయాలన్నా.. సాంబన్న అనుమతి ఉండాలా? ఇది ఎస్సీ నియోజకవర్గం అని మరిచిపోతున్నారా?“ అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
గత ఎన్నికల్లో వాస్తవానికి చామలూరి రాజగోపాల్ టికెట్ ఆశించారు. అయితే.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారనే కారణంగా ఆయనను తప్పించి..పద్మావతికే అవకాశం ఇచ్చారు. ఆమె గెలుపులో చామలూరి హస్తం ఉంది. ఎస్సీవర్గంలో ఉన్న బలమైన కేడర్ అంతా కూడా.. ఆయన చెప్పినట్టు నడుస్తోంది. అయితే, పద్మావతి ఎమ్మెల్యే అయిన తర్వాత.. ఆమె భర్త సాంబశివారెడ్డి దూకుడు పెరిగింది. దీంతో ఇక్కడ రెడ్డి వర్గం ఆధిపత్యం పెరిగిపోయిందని.. చామలూరు సహా అనేక మంది ఎస్సీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. పరిస్థితి ఇలానే కొనసాగితే..వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు.