దెబ్బ మీద దెబ్బ అంటారే.. ఇలాంటి అనుభవమే వొడా ఫోన్ ఐడియాకు ఎదురవుతోంది. ఒకటి తర్వాత ఒకటి చొప్పున ఈ కంపెనీకి తగిలిన ఎదురుదెబ్బలు అన్నీ ఇన్నీ కావు. వీటికి తోడు నెట్ వర్కు సమస్య ఒకటి తెగ ఇబ్బంది పెట్టేసింది. వీటన్నింటికి మించి.. కొండలా ఉన్న అప్పు కంపెనీ కొంప ముంచిన పరిస్థితి. టెలికం రంగంలో తనదైన హవాను ప్రదర్శించిన వొడా ఫోన్.. ఐడియాలు కలిసి వొడాఫోన్ ఐడియాగా మారినా.. దానికున్న లక్ లో మాత్రం మార్పు లేదని చెప్పాలి. ఇలాంటి వేళ.. అనూహ్యంగా తీసుకొచ్చిన ఒక ప్లాన్ వొడా ఐడియా దశ తిరిగేలా చేస్తుందని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో టెలికం కంపెనీలు ప్రతి నెల తమ సెల్ ఫోన్ ను రీఛార్జ్ చేయించుకోవాలని చెప్పటమే కాదు.. దానికోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి . ఇలాంటి వేళ.. గతంలో మాదిరి రెండో సిమ్ ను మొయింటైన్ చేయటం కష్టంగా మారుతోంది. ఎందుకంటే మినిమం ప్రతి నెలా రూ.100 – 150 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలాంటి వేళ.. ఈ సిమ్ కష్టాల్ని తీర్చేందుకు వొడా ఐడియాలు ఉమ్మడిగా కొత్త తరహా ప్లాన్ ను తెర మీదకు తీసుకొచ్చాయి.
దీని ప్రకారం వొడా ఐడియా తాజాగా రూ.549 తో రీచార్జ్ చేయించుకుంటే ఆర్నెల్ల పాటు (180 రోజుల పాటు) వినియోగించుకోనేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.
ఈ మొత్తానికి రీఛార్జి చేసిన వారికి అపరిమితమైన కాల్స్ చేసుకునే వీలుంటుంది.కాకుంటే.. కాల్స్ కంటే డేటా మీద బతికేవాళ్లకు మాత్రం ఈ కొత్త ప్లాన్ తో ఇబ్బందేనని చెబుతున్నారు. అయితే.. అదనంగా ఇచ్చే ఒక జీబీ డేటాను వినియోగించుకునే వీలుంది. మరింత అవసరం అనుకుంటే.. డేటాకు రీఛార్జి చేయించుకునే వీలుందని చెబుతున్నారు. మొత్తంగా రెండో సిమ్ వేసే వారిని టార్గెట్ చేసింది వొడా ఐడియా.