ఆంధ్రా క్రికెటర్ అంబటి రాయుడు ఉన్నట్లుండి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా అతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగుడుతూ ట్వీట్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. రాయుడు రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాడని.. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నాడని కొన్ని రోజుల కిందటే జోరుగా ప్రచారం జరగ్గా.. ఇంతలో అతను వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం పెద్ద షాక్. ఐతే వైఎస్ జగన్ మీద ముందు నుంచి రాయుడికి అభిమానం ఉందా.. అతను వైసీపీకి అనుకూలుడా అంటే అలా ఏమీ కాదు.
నిజానికి జగన్ పాలన పట్ల అతను వ్యతిరేకతతో ఉన్నాడని.. అందుకే టీడీపీ లేదా జనసేన తరఫున పోటీ చేయాలనుకున్నాడనే వార్తలు వచ్చాయి. అలాంటపుడు ఈ ట్వీట్ ఏంటి అన్నది అర్థం కాని విషయం. ఐతే ఇదంతా అతను ఆవేశంతో చేసిన పని అన్నది తన గురించి తెలిసిన వాళ్లు చెబుతున్న మాట. తెలుగుదేశం వాళ్లతో కొన్ని వారాల కిందట రాయుడికి మీటింగ్ జరిగిన మాట వాస్తవం. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడానికి రాయుడు ఆసక్తి చూపగా.. అట్నుంచి కూడా సానుకూల స్పందనే వచ్చింది. ఐతే తనతో మాట్లాడింది ద్వితీయ శ్రేణి నాయకులు కాగా.. పెద్ద నేతల నుంచి కబురు వస్తుందని.. అట్నుంచే ఆఫర్ ఉంటుందని రాయుడు ఆశించాడు. కానీ అలా జరగలేదు. దీంతో అతడి ఇగో హర్ట్ అయింది.
తనను పట్టించుకోనందుకు టీడీపీ ఝలక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అతను ఆవేశంతో జగన్‌కు అనుకూలంగా ట్వీట్ వేసినట్లు తెలుస్తోంది. ఐతే రాజకీయాల్లోకి రావాలనుకున్న వ్యక్తి ఇలా ఆవేశానికి పోతే చెడు జరిగేది తనకే. ముందు నుంచి రాయుడి తీరు గమనిస్తే అతడికి ఆవేశం ఎక్కువ అనే విషయం అర్థమవుతుంది. కెరీర్ ఆరంభంలో హైదరాబాద్‌కు ఆడుతుండగా.. ఇక్కడి రాజకీయాలు చూసి ఆవేశపడి ఐసీఎల్‌లోకి వెళ్లాడు. దాని మీద బీసీసీఐ నిషేధం విధించి.. కొన్నేళ్ల పాటు క్రికెటర్లను కూడా బహిష్కరించింది. ఆపై నిషేధం తొలగిపోయి ఐపీఎల్లో సత్తా చాటాడు. ఇండియన్ టీంలోకి కూడా వచ్చాడు.
ఐతే 2019 ప్రపంచకప్ జట్టులోకి తనను ఎంపిక చేయకపోవడంపై ఆగ్రహం చెంది.. తన బదులు ‘త్రీ డైమన్షన్ ప్లేయర్’ అంటూ విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన ఎమ్మెస్కే ప్రసాద్‌కు కౌంటర్ ఇస్తూ.. ‘‘ప్రపంచకప్ చూసేందుకు త్రీడీ గ్లాసెస్ కొంటున్నా’’ అని ట్వీట్ వేయడం దుమారం రేపింది. అదే సమయంలో ఆవేశపడి క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు కూడా ప్రకటన చేశాడు. తర్వాత దానిపై వెనక్కి తగ్గాడు. క్రికెట్ కెరీర్లో ఇలా ఆవేశపడి అనర్థాలు కొని తెచ్చుకున్న రాయుడు.. ప్రస్తుతం ఏపీలో జగన్, వైసీపీ మీద వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతున్న విషయాన్ని గ్రహించకుండా ట్వీట్ వేసి లేని తలనొప్పులు కొని తెచ్చుకుంటున్నట్లున్నాడు. రాయుడు ఇలా ట్వీట్ వేశాడని వైసీపీ అతడికి టికెట్ ఇచ్చేయదు. తన మనస్తత్వానికి ఆ పార్టీ సూటయ్యే అవకాశాలు కూడా తక్కువే. రేప్పొద్దున పరిస్థితులు మారి టీడీపీలోనో, జనసేనలోనో చేరినా.. ఇప్పుడు అతను వేసిన ట్వీట్ తాలూకు స్క్రీన్ షాట్‌తో వైసీపీ వాళ్లు ఎటాక్‌కు రెడీగా ఉంటారని మరిచిపోరాదు.