సీనియర్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తూ గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్న ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. దీనిపై పొంగులేటి ఎలా రియాక్టు అవుతారు? అన్న ప్రశ్నకు సమాధానంగా వేగంగా రియాక్టు అయ్యారాయన. తనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నంతనే మాట్లాడిన ఆయన.. ‘‘ఇన్ని రోజులకు దొరల గడీ నుంచి విముక్తి కలిగింది.ఇప్పటికైనా సస్పెండ్ చేయటం ఆనందంగా ఉంది. నన్ను సస్పెండ్ చేయటం హాస్యాస్పదం. జనవరి నుంచి పార్టీని.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా. ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని సస్పెండ్ చేశారు’’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పార్టీ నుంచి సస్పెన్షన్లే ఉండవన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. ‘‘బీఆర్ఎస్ లో సస్పెన్షన్లే ఉండవని ఒకరంటారు. దమ్ము.. ధైర్యం ఉంటే మీరే రాజీనామా చేయాలని మరొకరు అంటారు. మరి, నేను సభ్యుడినే కాదన్నప్పుడు నన్నెలా సస్పెండ్ చేశారు?’’ అని ప్రశ్నించారు. పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపుకోసం తనతో చాలాసార్లు మాట్లాడారని.. తనకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని.. తాను ఆ మాటల్ని నమ్మి పార్టీలో చేరానని చెప్పారు. తాను పార్టీలో చేరే నాటికే తెలంగాణ వైసీపీ అధ్యక్షుడినని.. కేసీఆర్ మాటల్ని నమ్మి పార్టీలో చేరినట్లు చెప్పారు.
‘‘ఆర్థిక ఇబ్బందులున్నా.. అవమానాలు ఎదురైనా భరించా. నాకు టికెట్ ఇవ్వకున్నా కేసీఆర్ కోసం పని చేశా. 2018లో ఖమ్మం ఓటమికి కారణం ఎవరో అందరికి తెలుసు. ఖమ్మం జిల్లా సమస్యలపై ఏనాడైనా చర్చించారా? తప్పు మీ దగ్గర పెట్టుకొని నాపై నిందలు వేస్తారా? బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు తెలంగాణ బిడ్డలు అనేక ఇబ్బందులు పడుతున్నారు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తాను తెలంగాణ వైసీపీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. పార్టీలోకి చేరాలని ఎన్నోసార్లు ఆహ్వానించారన్నారు. పార్టీలో చేరాలంటూ తనపై ఎన్నోసార్లు ఒత్తిడి తెచ్చారన్నారు. ‘‘కేటీఆర్ అనేకసార్లు నాతో మాట్లాడి.. ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి మాటల్ని నమ్మి పార్టీలో చేరా. నాకు ఎంపీ టికెట్ ఇవ్వకున్నా కేటీఆర్ కోసమే పార్టీలో ఉన్నా. పాలేరు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం కేటీఆర్ ఎన్నోసార్లు నన్ను సంప్రదించారు. తాను ఇచ్చిన మాటలకు తగ్గట్లే.. తాను పాలేరు ఉప ఎన్నికను భారీ మెజార్టీతో గెలిపించుకొచ్చా’’ అంటూ గతాన్ని గుర్తు చేశారు. తాను పార్టీలో చేరినప్పుడు ఆర్నెల్లలో సారు గురించి నీకు తెలుస్తుందని.. అసలు రూపం చూస్తావని తోటి ఎంపీలు చెప్పారని.. ఐదు నెలల్లోనే సీఎం అసలు స్వరూపం అర్థమైందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చూస్తే.. రానున్నరోజుల్లో పొంగులేని నుంచి మరిన్ని పంచ్ లు తప్పవన్న మాట వినిపిస్తోంది.