చివరకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తప్పుపడుతున్నారు. బీజేపీలో చేరిన సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు చేశారంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ కిరణ్ ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీకి అధికారమే ముఖ్యమట. క్షేత్రస్ధాయిలో ఏమి జరుగుతోందో అధిష్టానం తెలుసుకోలేకపోతోందన్నారు. ఎవర్నీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసేసుకుంటుందట. చేసిన తప్పు ఏమిటన్నది కూడా కాంగ్రెస్ విశ్లేషించుకోవటంలేదని కిరణ్ తీవ్రంగా విమర్శించారు. ఓటముల నుండి కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవటంలేదని తెగ బాధపడిపోయారు.
కిరణ్ చెప్పింది ఒక విధంగా నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే నియోజకవర్గానికి ఎక్కువ జిల్లాకు తక్కువైన కిరణ్ ను అధిష్టానం ఏకంగా ముఖ్యమంత్రిని చేసేసింది. చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన ఒక నేతను తీసుకొచ్చి సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం అధిష్టానం చేసిన తప్పు. అధిష్టానం ఎవరినీ సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటుందని కిరణ్ చెప్పింది నూరుశాతం నిజమే. కిరణ్ ను సీఎం చేసేముందు అభిప్రాయాలు తీసుకునుంటే కిరణ్ ఎప్పటికీ సీఎం అయ్యుండే వారుకాదు.
చేసిన తప్పు ఏమిటో కూడా కాంగ్రెస్ విశ్లేషించుకోవటంలేదన్నది కూడా కరెక్టే. కిరణ్ ను సీఎం చేసిన తర్వాత పాలనలో ఫెయిలయ్యారని మంత్రులే బహిరంగంగా ఆరోపణలు చేసినా కూడా తన నిర్ణయాన్ని విశ్లేషించుకోలేదు కాబట్టే మూడున్నర ఏళ్ళు సీఎంగా ఉండగలిగారు. అచ్చంగా అదృష్టం మీద ఆధారపడే కిరణ్ సీఎం అయ్యారు కానీ లీడర్ షిప్ క్వాలిటి ఉండికాదు. ఎందుకంటే సీఎంగా కిరణ్ ను ఆమోదించేది లేదని క్యాబినెట్ సమావేశంలో కొందరు మంత్రులు మొహం మీదే చెప్పేసినా ఎవరినీ ఏమి చేయలేకపోయారు.
కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్స్ లేకపోవటం పెద్ద మైనస్సని కిరణ్ చెప్పటం నిజమే. ఎందుకంటే అన్నీచోట్లా కిరణ్ లాంటి వాళ్ళే ఉన్నారు కాబట్టే ట్రబుల్ షూటర్స్ లేకుండాపోయారు. అర్హత లేకపోయినా అదృష్టంతో సీఎం అయిపోయి మూడున్నరేళ్ళు ప్రోటోకాల్ ఎంజాయ్ చేసి చివరకు పార్టీని గాలికి వదిలేసిన కిరణ్ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని తప్పుపడుతున్నారంటేనే ఆశ్చర్యంగా ఉంది.