అభివృద్ధిలో దేశంలోనే ముందున్నామని.. ఇటీవల అసెంబ్లీలోనూ ప్రస్తావించిన ఏపీ సీఎం జగన్‌కు షాకి చ్చేలా.. కేంద్రం ఇప్పుడు.. ఏపీ గురించి ఒక సంచలన విషయం వెల్లడించింది. ముఖ్యంగా విశాఖను రాజధాని చేస్తున్నామని.. ఇక్కడ ఐటీని మరింత ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న సీఎం జగన్ సర్కారు వ్యవహారాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్రం వెల్లడించింది. ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 0.2% లోపే ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.
2021-22లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.926 కోట్లు మాత్రమేన ని చంద్రశేఖర్ తెలిపారు. దేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో ఇది 0.14% ఉండగా.. గత ఏడాదిలో దారుణంగా క్షీణించిందన్నారు. ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా ఇప్పుడు 0.2% కంటే తక్కువగానే ఉందన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ప్రధాన ఐటి హబ్‌గా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
రాష్ట్రంలో మంచి మౌలిక సదుపాయాలు, భారీ ఉత్పాదక స్థావరాలు, ప్రతిభావంతులైన యువత, వ్యాపార అనుకూల వాతావరణం ఉన్నాయని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ -2.0 అనే పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఇంక్యుబేషన్ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు.
ఎస్టిపిఐ, ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ (ఎపిఐఎస్) సంయుక్త తనిఖీ నిర్వహించాయని, అయితే సరైన స్థలం చూపించలేదని కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎస్టిపిఐ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ఎస్‌టిపిఐకి ఒక ఎకరం భూమిని అందించేందుకు అంగీకారం తెలిపిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా కృషి చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆయన అన్నారు.