కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అమరావతి రాజధానిపైనా.. అమరావతిలో రైతులు ఇచ్చిన భూములను పేదలకు పంపిణీ చేస్తామంటూ.. ఏపీ సీఎం జగన్ అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 45 పైనా హైకోర్టులో కేసులు ఉన్నాయి. వీటిలో ఎలాంటితీర్పు వస్తుందో తెలియదు. అయినా కూడా.. సీఎం జగన్ మాత్రం తన పద్ధతిని ఏమాత్రం మార్చుకోవడం లేదు. మరోసారి అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. ఇళ్లు లేని వారికి అమరావతిలో ఇంటి పట్టాలు ఇస్తామని తెలిపారు.
తాజాగా జరిగిన 33వ సీఆర్ డీఏ అథారిటీ సమావేశంలో సీఎం జగన్ దీనికి ఆమోదం తెలిపారు. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అమరావతిలో “పేదలందరికీ ఇళ్లు” కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ గతంలోనే జీవో జారీ చేశారు. అమరావతిలో 1134.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయించారు. మొత్తం 20 లే అవుట్లలోని స్థలాలను గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48 వేల 218 మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలనీ నిర్ణయించారు.
లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. అయితే, వాస్తవానికి రాజధాని పరిధిలో ఇతర జిల్లాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం తెచ్చిన జీవో 45పై.. రాజధాని రైతు జేఏసీ నేతలు హైకోర్టును గతంలోనే ఆశ్రయించారు.
రాజధాని కోసం ఇచ్చిన తమ భూముల్లో.. ఇతరులకు ఇళ్ల స్థలాలు ఎలా కేటాయిస్తారంటూ.. రాజధాని రైతులు మండిపడుతున్నారు. అయితే ఓ వైపు రాజధాని రైతుల పిటిషన్.. మరోవైపు సీఎం జగన్ నిర్ణయాలతో ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.