విమర్శల స్థాయి దాటిపోయింది. తిట్ల స్థానే బండబూతులు తిట్టుకోవటం ఎక్కువైంది. ముందు.. వెనుకా చూసుకోకుండా మాటలు అనేసుకోవటం స్థానే ఇప్పుడు కొట్టేసుకునే వరకు వెళ్లిపోయింది ఏపీలో రాజకీయం. అధికార వైసీపీ విపక్ష టీడీపీ మధ్య నడుస్తున్న రాజకీయ పోరు పోనుపోనూ హద్దులు దాటిపోయి.. వికృతరూపం దాలుస్తోంది. దీనికి నిలువెత్తు నిదర్శనంగా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకున్న తన్నులాటే నిదర్శనంగా చెబుతున్నారు. తాజాగా జరిగిన కౌన్సిల్ సమావేశం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవటమే కాదు.. అధికార.. విపక్ష సభ్యులు కొట్టేసుకోవటం షాకింగ్ గా మారింది.
టీడీపీ కౌన్సిలర్ యుగంధర్ పై వైసీపీకి చెందిన కౌన్సిలర్లు దాడి చేయటం ఒక ఎత్తు అయితే..ఒక సభ్యుడు బెంచి మీదకు ఎక్కి మరీ టీడీపీ సభ్యుడి మీద దాడి చేసిన వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ వివాదం ఎక్కడ మొదలైందంటే.. నవరత్నాల పథకాల్లో భాగంగా చేపట్టిన పనుల్లో సింగిల్ టెండర్ ఆమోద అంశంపై టీడీపీ సభ్యుడు యుగంధర్ అభ్యంతరం తెలిపారు. దీనిపై వైసీపీ కౌన్సిలర్ అభ్యంతరం తెలిపారు. దీంతో.. మాటా మాటా పెరిగింది.
టీడీపీ సభ్యుడి తీరుపై ఆగ్రహాన్నివ్యక్తం చేసిన వైసీపీ కౌన్సిల్ సభ్యుడు దూసుకు వచ్చి.. దాడికి పాల్పడ్డారు. దీంతో.. టీడీపీ కౌన్సిలర్లు వైసీపీ కౌన్సిలర్ కు అడ్డుగా నిలవటంతో.. ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య తోపులాట.. తన్నులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై వైసీపీ సభ్యులు దాడికి పాల్పడినట్లుగా ఆరోపిస్తున్నారు. అయితే.. ఒక దశ దాటిన తర్వాత మాత్రం ఇరు పార్టీల సభ్యులు ఎవరూ తగ్గలేదన్న మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలను టీడీపీ కౌన్సిలర్లు ప్రదర్శిస్తున్నారు.
ఈ తన్నులాటలో ఒకరిద్దరి సభ్యుల చొక్కాలు చినిగిపోయిన పరిస్థితి. తమపై జరిగిన దాడికి నిరసనగా టీడీపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ గొడవను ఆపటానికి ప్రయత్నించిన ఛైర్ పర్సన్ ఎంతకూ ఆగకపోవటంతో.. సభను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొని వెళ్లిపోయారు. కౌన్సిల్ లో సభ్యులు విచక్షణ మరిచి.. ఇలా కొట్టుకోవటం ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. తమ మీద మొదట దాడి చేసింది వైసీపీ కౌన్సిలర్లేనని మండిపడుతున్నారు. ఒక టీడీపీ కౌన్సిల్ సభ్యుడి కులాన్ని దూషిస్తూ తిట్టి.. కొట్టిన వైనంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.