తెలంగాణలో ఈ ఏడాది చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన వారసుడు పోటీ చేస్తాడని.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చెప్పారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేయాలని ఎప్పుడో అధిష్టానానికి సమాచారం ఇచ్చామని కూడా ఆయన వెల్లడించారు. బీజేపీపై పోరుకు ఎన్నికలకు సంబంధం లేదన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే ఆ విషయాన్ని ఎన్నికల అనంతరం ప్రజలు నిర్ణయిస్తారని జానా రెడ్డి అన్నారు.
బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని జానారెడ్డి చెప్పారు. పార్లమెంట్లో రాహుల్‌పై అనవసరంగా ..రాజకీయ కుట్రంతోనే వేటు వేశారని అన్నారు. ఈ వ్యవహారంతో దేశం అట్టుడుకుతోందన్నారు. దేశంలో బీజేపీ పెట్టుబడు దారుల కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు. అదానీ కంపెనీలో షేర్లు పెట్టిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొంటూ..పరోక్షంగా ప్రధాని మోడీపై జానా రెడ్డి విమర్శలు గుప్పించారు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త అదానీ, ప్రధాని మోడీకి ఉన్న సంబంధాలపై రాహుల్ గాంధీ నిలదీశారని, ఈ క్రమంలోనే ఆయనపై పార్లమెంటు వేటు వేసిందని జానా రెడ్డి చెప్పారు. రాహుల్ ప్రశ్నించకుండా ఉండేందుకే ఇలా ఆయన గొంతు నొక్కారని అన్నారు. అదానీ వ్యవహారం బయటపడొద్దని రాహుల్‌ను పార్లమెంట్ నుంచి బయటకు పంపించారని వ్యాఖ్యానించారు. అక్రమాలకు, అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడుతున్నారని, తాము కూడా ఆయనకు మద్దతుగానే ఉంటామని చెప్పారు.
రాజకీయ కక్ష సాధింపులు..!
ప్రధాని మోడీ అధికార యంత్రాంగాన్ని వాడుకుని రాజకీయ కక్ష సాధింపులకు దిగుతున్నారని జానా రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలు గొంతు విప్పాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ ఏకపక్ష విధానాలకు వ్యతిరేకంగా, ఆయన పాలనకు వ్యతిరేకంగా 17 పార్టీలు ఆందోళన చేస్తున్నాయని చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నీ కాంగ్రెస్‌కు మద్దుతివ్వాలని జానా రెడ్డిపిలుపునిచ్చారు. అధికారం కోసం బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే బీజేపీకి బుద్ధి చెప్పాలని జానా రెడ్డి పిలుపునిచ్చారు.