వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు .. ఇటీవలే బీజేపీ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నాలక్ష్మీనారాయణ అదిరిపోయే సవాల్ విసిరారు. జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలలో డబ్బు, మద్యం పంచకుండా రావాలని సవాల్ విసిరారు. ‘‘నీ నవరత్నాలపై నీకు నమ్మకం ఉంటే సక్రమ పద్దతిలో ఎన్నికలకు రా! సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకో. కులం, మతం చూడకుండా పాలన చేశానని ప్రజలను ఓట్లు అడిగే దమ్ము ఉందా. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే విమర్శలు, సవాళ్లు’’ అంటూ కన్నా ఫైర్ అయ్యారు.
టీడీపీ ఏదైనా కార్యక్రమం చేస్తే రాత్రికి వాళ్ల ఆస్తులు తగలబెట్టడమా ధైర్యం అని కన్నా ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు , ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్ తరచుగా చేసే సవాల్‌పై కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. పోలీసులతో పాలన చేయడమా జగన్ రెడ్డి దమ్ము.. ప్రతిపక్షాల నోరు నొక్కడమేనా జగన్ దమ్ము అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడమా జగన్ రెడ్డి ధైర్యమని నిలదీశారు.
ఏపీలో జగన్ రాక్షస క్రీడ ఆడుతున్నారని, ఏపీని జగన్ సర్కార్ దోచుకుంటోందని కన్నా ఆరోపించారు. జగన్‌రెడ్డి సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని, దీనికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనమన్నారు. సంక్షేమమంటే మొదట గుర్తొచ్చేది ఎన్టీఆర్ పరిపాలనే అని, ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని కన్నా గుర్తు చేశారు.
కసిగా తిట్టిపోసిన జేసీ!
ఇక, వైసీపీ సర్కారుపై.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సైతం.. ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు అసహ్యంతో ఉన్నారన్నారు. టీడీపీ వెంట ప్రజలు నడుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కనిపిస్తోందని తెలిపారు. ప్రజలు రోడ్లపై రావడానికి సిద్ధంగా ఉన్నారని.. జగన్ మీద ఉన్న వ్యతిరేకతతోనే ఎమ్మెల్సీ ఎన్నికలను స్వీప్ చేశారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్పేది కరెక్టే అని అన్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేస్తోందని, అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.