ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధిస్తానని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, మద్యపాన నిషేధం కోసం జగన్ అనుసరిస్తున్న విధానాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. మద్యపాన నిషేధం పేరుతో జగన్ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని నాసిరకం బ్రాండ్ లను ఏపీలో అమ్ముతున్నారని, వాటివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బ తింటోందని అంటున్నారు.
ఇక, మద్యపాన నిషేధం పేరుతో మద్యం ధరలు భారీగా పెంచడం ద్వారా మందుబాబుల జేబులు గుల్ల అవుతున్నాయి. దీంతో, చాలామంది మందుబాబులు మందేయడం కోసం పెళ్లాల తాళిబొట్లు సైతం తాకట్టు పెట్టేందుకు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. మద్యపాన నిషేధం అంటూనే జగన్ రెడ్డి మహిళల మెడలో పుస్తెలు కూడా లాగేస్తున్నారని విరుచుకుపడ్డారు. విషం కంటే ప్రమాదకరమైన బ్రాండ్లు తయారు చేసి, వాటితో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
2019లో రూ.5 వేల కోట్లు ఉన్న లిక్కర్ ఆదాయం… 2021నాటికి రూ.10 వేల కోట్లకు చేరడం జగన్ ఘనతేనని ఎద్దేవా చేశారు. మద్యం పేరుతో రూ.10 వేల కోట్లు దోపిడీ చేయడం…మరోవైపు మద్యపాన నిషేధం అంటూ కటింగ్ ఇవ్వడం ఒక్క జగన్ రెడ్డికే చెల్లిందని సెటైర్ వేశారు. ఈ వ్యాఖ్యలు విని టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని బులుగు బ్యాచ్ చొక్కాలు చించుకుంటారని, అందుకే ఈ ఆరోపణలకు ఆధారాలు కూడా వెల్డడించారు అయ్యన్నపాత్రుడు. కాగ్ బయటపెట్టిన జగన్ రెడ్డి బాగోతం అంటూ కాగ్ వెల్డడించిన గణాంకాలని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.